ఎక్కడ చూసినా బురదమన్ను.. కొండరాళ్లు
ABN , Publish Date - Aug 28 , 2026 | 06:13 AM
నిన్నటి వరకు యాత్రికులు, స్థానికుల కోలాహలంతో సందడిగా ఉన్న హిమాలయ లోయలు.. ఇప్పుడు భయానక పరిస్థితులతో నిశ్శబ్దంగా మారిపోయాయి. నేపాల్ సరిహద్దు రసువా నుంచి టిబెట్‌లోని గైరోంగ్ వరకు ఎక్కడ చూసినా.. కొండచరియల విధ్వంసమే. బురద మన్ను కింద వందలాది ఇళ్లు, గ్రామా లు కనుమరుగైన భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో విషాద నిశ్శబ్దం..
392కు చేరిన మృతులు.. 1500 మంది గల్లంతు
జాడలేని 288 మంది భారతీయులు
ఆచూకీ లేని 600 మంది విదేశీయులు
ఖాట్మండు, ఆగస్టు 27: నిన్నటి వరకు యాత్రికులు, స్థానికుల కోలాహలంతో సందడిగా ఉన్న హిమాలయ లోయలు.. ఇప్పుడు భయానక పరిస్థితులతో నిశ్శబ్దంగా మారిపోయాయి. నేపాల్ సరిహద్దు రసువా నుంచి టిబెట్‌లోని గైరోంగ్ వరకు ఎక్కడ చూసినా.. కొండచరియల విధ్వంసమే. బురద మన్ను కింద వందలాది ఇళ్లు, గ్రామా లు కనుమరుగైన భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫొటోలు పట్టుకుని ఆస్పత్రుల్లోని వార్డుల్లో తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల జాడ కోసం అన్వేషణ. అక్కడ కనిపించకపోతే మార్చురీల దగ్గర వెతుకులాట. సమాచార వ్యవస్థలు చిన్నాభిన్నం కావడంతో మొబైల్‌ఫోన్ల ద్వారా సంప్రదించలేని పరిస్థితి. తమవారు బతికున్నారో? లేదో.. ఉంటో ఎక్కడ చికిత్స పొందుతున్నారో తెలియక బాధితులు పడుతున్న వేదన వర్ణనాతీతం. జల ప్రళయం అనంతరం నేపాల్‌లో గురువారం కనిపించిన దయనీయ దృశ్యాలు ఇవి. టిబెట్ సరిహద్దుల్లో.. నేపాల్‌లోని రసువా, దాడింగ్ జిల్లాల పరిసరాలపై బుధవారం ఒక్కసారిగా ఆకస్మిక మెరుపు వరదలు, కొండచరియలు విరుచుకుపడడం తెలిసిందే. ఈ విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రానికి మృతుల సంఖ్య 392కు చేరినట్టు నేపాల్ పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. టిబెట్‌వైపు అధికారికంగా మరో మూడు మరణాలు నమోదయ్యాయి. అటు టిబెట్, ఇటు నేపాల్‌లో కలిపి 1500 మంది వరకుగల్లంతైనట్టు తాజా సమాచారం. వీరిలో భారత్‌కు చెందిన 288 మంది పర్యాటకులు సహా 600 మంది విదేశీయులు ఉన్నారు. వరద ఉధృతికి మొబైల్ టవర్లు, రోడ్లు కొట్టుకుపోవడంతో సమాచార, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.
మానససరోవర యాత్రీకులే ఎక్కువ..
288 మంది భారతీయ పౌరులతో సంబంధాలు తెగిపోయినట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. వీరిలో 170 మంది వరకు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన భక్తులే ఉన్నారు. ఈశా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది సభ్యులు కూడా గల్లంతయ్యారు. అలాగే, త్రిశూలి-1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయ కార్మికులు కూడా ఉన్నారు. వీరిని గుర్తించేందుకు భారత విదేశాంగ శాఖ, నేపాల్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టింది. విదేశాంగ మంత్రి జైశంకర్.. ఖాట్మండు, బీజింగ్ రాయబారులతో వర్చువల్‌గా సమీక్ష నిర్వహించి, భారతీయులను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముమ్మరంగా సహాయక చర్యలు..
వంతెనలు, రహదారులు కొట్టుకుపోవడంతో 40 ప్రైవేటు చార్టర్డ్ హెలికాప్టర్లతో పాటు నేపాల్ ఆర్మీకి చెందిన 12 ఎంఐ-17 హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం రంగంలోకి దింపారు. నేపాల్ ఆర్మీ, సాయుధ పోలీసు బలగాలు (ఏపీఎఫ్), నేపాల్ పోలీసులు డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్‌తో చిక్కుకుపోయిన బాధితుల కోసం జల్లెడపడుతున్నాయి. ఇప్పటి వరకు 466 మందికి పైగా బాధితులను స్యాప్రుబేసి, మైలుంగ్, ధుంచే, తిమురే తదితర పారంతాల నుంచి కాపాడాయి. శిథిలాల కింద ఎవరైనా సజీవంగా ఉండొచ్చన్న ఆశతో రెస్క్యూ టీమ్‌లు అధునాతన పరికరాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. భారత్ నేపాల్‌కు రెండో విడత సహాయక సామగ్రిని పంపింది. బుధవారం మొదటి విమానంలో 10 టన్నుల అత్యవసర ఔషధాలు, టెంట్లు, సోలార్ ల్యాంప్‌లను పంపగా.. గురువారం సీ-17 విమానంలో మరింత సహాయక సామగ్రి (మొత్తం 47.5 టన్నులు)ని నేపాల్‌కు తరలించింది. క్షేత్రస్థాయి సహాయక చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలను సైతం సిద్ధంగా ఉంచింది. ఆకస్మిక వరదలు నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్ రీజియన్‌లోనూ భారీ నష్టం కలిగించాయి. వందలాది మంది గల్లంతు కావడంతో.. చైనా ప్రధాని లీకియాంగ్ స్వయంగా గైరోంగ్‌లో పర్యటించారు.
ఊళ్లకు ఊళ్లే అడ్రస్ గల్లంతు!
రసువా, నువాకోట్, దాడింగ్, చిత్వాన్, గోర్ఖా, తనహున్, తూర్పు నవల్‌పరాసి జిల్లాల పరిధిలో దాదాపు డజన్లకొద్దీ గ్రామాలు, సరిహద్దు మార్కెట్లు కొట్టుకుపోయాయి. 19 వంతెనలు.. రసువాగఢి సరిహద్దును కలిపే 42కిలోమీటర్ల ప్రధాన రహదారి తుడిచిపెట్టుకుపోయాయి. సాయం కోసం బాధితుల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థనలు వస్తుండగా.. ఆ స్థాయిలో నేపాల్ ప్రభుత్వ యంత్రాంగానికి సామర్థ్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ ప్రతిస్పందన సామర్థాలకు మించి ఈ విపత్తు విధ్వంసం ఉన్నట్టు నేపాల్‌లోని క్లైమేట్ రిస్క్ అండ్ రిసైలెన్స్ ల్యాబ్ ఈడీ బినోద్ ప్రసాద్ పరాజులి తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
నేపాల్‌లో చిక్కుకున్న 23 మంది తెలంగాణవాసులు
Read Latest AP News And Telangana News And International News And Telugu News