Share News

గిరిజన విద్యార్థులకు ‘ఎక్స్‌లెన్స్‌’ సెంటర్‌

ABN , Publish Date - Aug 28 , 2026 | 05:36 AM

అమరావతి, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు ప్రతిష్టాత్మక జాతీయస్థాయి విద్యాసంస్థల్లో వారు ప్రవేశాలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌, ఐఐటీ-జేఈఈ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ, సమగ్ర రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను ఏర్పాటు చేసింది.

గిరిజన విద్యార్థులకు ‘ఎక్స్‌లెన్స్‌’ సెంటర్‌

  • విశాఖలోని మారికవలసలో ఏర్పాటు

  • 600 మందికి నీట్‌, జేఈఈ కోచింగ్‌

అమరావతి, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచడంతో పాటు ప్రతిష్టాత్మక జాతీయస్థాయి విద్యాసంస్థల్లో వారు ప్రవేశాలు పొందేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్‌, ఐఐటీ-జేఈఈ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్టీ విద్యార్థులకు అత్యుత్తమ, సమగ్ర రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ను ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలోని మారికవలస రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిభావంతులైన ఎస్టీ విద్యార్థులు నీట్‌, జేఈఈ వంటి ప్రవేశ పరీక్షల ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఎయిమ్స్‌, ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా వారిని తీర్చిదిద్దడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ సెంటర్‌లో 600 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. ఇందులో 300 మంది బాలురు, 300 మంది బాలికలు ఉంటారు. మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఎంపికైన విద్యార్థులను ఈసెంటర్‌కు తరలిస్తున్నారు. ఆహారం, వసతి తదితర ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ కేంద్రానికి అవసరమైన వసతులు, ఫర్నీచర్‌, ఐసీటీ సదుపాయాలు, మానవ వనరుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా సంబంధిత శాఖల సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన పనులను చేపడుతున్నారు. విద్యాపరంగానే కాకుండా సామాజిక, ఆర్థికంగా కూడా గిరిజన విద్యార్థుల అభివృద్ధికి దోహదపడేలా చర్యలు చేపడుతున్నట్లు ఏపీ గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.

Updated Date - Aug 28 , 2026 | 05:36 AM