కోనేరు సుందరీకరణకు శ్రీకారం
ABN , Publish Date - Aug 27 , 2026 | 12:35 AM
పట్టణ ప్రజల చిరకాల వాంఛ నెరవరే దిశగా మరో అడుగు పడింది.
పాలకొండ, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పట్టణ ప్రజల చిరకాల వాంఛ నెరవరే దిశగా మరో అడుగు పడింది. పట్టణంలోని చారిత్రక వెంకటరాయుని కోనేరు సుందరీకరణ పనులకు బుధవారం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సుడా చైర్మన్ కొరికాన రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయకృష్ణ, చైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలకొండ పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వెంకటరాయుని కోనేరు సుందరీకరణ పూర్తయితే పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందడంతో పాటు చారిత్రక కోనేరు పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందన్నారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా సురక్షితమైన ప్లేజోన్, క్రీడాభిరుచి ఉన్న యువత కోసం బాక్స్ క్రికెట్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. వృద్ధులు, సీనియర్ సిటిజన్లు ప్రశాంతంగా సేదతీరేందుకు ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. సందర్శకులకు వివిధ రకాల తినుబండారాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. రాత్రి వేళల్లో కోనేరు పరిసరా లు మరింత ఆకర్షణీయంగా కనిపించేలా విద్యుత్ కాంతులు, ఆధునిక లైటింగ్ అలంకరణలు ఏర్పాటు చేయనున్నామన్నారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పాలకొండను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.