మృత్యుంజయులు
ABN , Publish Date - Sep 06 , 2026 | 06:02 AM
ఏమైందో తెలియదు.. ఏం జరుగుతుందో తెలియదు.. నా అనే వారి జాడ లేదు.. తినడానికి తిండి లేదు.. తాగేందుకు చుక్క నీరు లేదు.. ఎటు చూసినా బురదే.. అసలు పగలో రాత్రో కూ...
టన్నెల్ నుంచి కార్మికుడిని కాపాడి తీసుకువస్తున్న సైనికులు
కాఠ్మాండు, సెప్టెంబరు 5: ఏమైందో తెలియదు.. ఏం జరుగుతుందో తెలియదు.. నా అనే వారి జాడ లేదు.. తినడానికి తిండి లేదు.. తాగేందుకు చుక్క నీరు లేదు.. ఎటు చూసినా బురదే.. అసలు పగలో రాత్రో కూడా తెలియని పరిస్థితి.. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఒకటి, రెండు కాదు ఏకంగా పది రోజుల పాటు బురదలో ఇరుక్కుపోయిన ఇద్దరు సజీవంగా బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం సృష్టించిన ప్రాంతంలో సహాయక బృందాలు శనివారం మరో ఇద్దరిని సజీవంగా వెలికితీశాయి. బిదూర్ పట్టణంలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలోని నాలుగో అంతస్తులో బురదలో ఇరుక్కుపోయి అపస్మారక స్థితిలో ఉన్న చంద్రిక శ్రేష్ఠ(60) అనే మహిళను సహాయక బృందాలు శనివారం రక్షించాయి. అలాగే, త్రిశూలి 1 జల విద్యుత్ కేంద్రంలోని ఓ సొరంగంలో 225 మీటర్ల లోపల బురదలో ఇరుక్కుపోయిన చైనాకు చెందిన ఓ కార్మికుడిని సహాయక బృందాలు శనివారం మధ్యాహ్నం సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి. త్రిశూలి జలవిద్యుత్ కేంద్రంలో ఇరుక్కుపోయిన మరో ఇద్దరిని శుక్రవారం సజీవంగా బయటకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన ఆకస్మిక వరద వల్ల 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 5,000 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. త్రిశూలి జలవిద్యుత్ కేంద్రం సొరంగాల్లో 500 మందికి పైగా కార్మికులు ఉండి ఉంటారని అధికారుల అంచనా.
మృతదేహాల నుంచి డీఎన్‌ఏ సేకరణ
గుర్తు పట్టలేని స్థితిలో లభించిన 1030 మృతదేహాల నుంచి డీఎన్‌ఏ పరీక్షల కోసం నమూనాలు సేకరించి, వాటిని ఖననం చేశామని అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా 1260 మృతదేహాల నుంచి 1012 మంది బాధిత కుటుంబాల వారి నుంచి డీఎన్‌ఏ పరీక్షలకు నమూనాలు సేకరించామని వెల్లడించారు. కాగా, వరంగల్ జిల్లా మామునూర్‌కు చెందిన రేగూరి వినయ్ రెడ్డి ఈశా ఫౌండేషన్ తరఫున మానస సరోవర యాత్రకు వెళ్లి వరదల్లో గల్లంతయ్యారు. కెనడాలో స్థిరపడిన ఐటీ ఉద్యోగి అయిన వినయ్ ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News