నేపాల్ రెస్క్యూ ఆపరేషన్లలో భారత ప్రత్యేక బృందం!
ABN , Publish Date - Aug 31 , 2026 | 07:51 PM
నేపాల్ వరదల ధాటికి త్రిశూలి బేసిన్‌లోని జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో పలువురు చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసేందుకు భారత్‌కు చెందిన ప్రత్యేక సొరంగ శోధన, సహాయక బృందం రెస్క్యూ ఆపరేషన్లలో భాగస్వామ్యమైంది.
ఖాట్మండు (నేపాల్), ఆగస్టు 31: నేపాల్‌లో విపత్తు ప్రభావిత జలవిద్యుత్ సొరంగాల ప్రాంతాలలో నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్‌లో భారత్ చేరింది. మన దేశానికి చెందిన సొరంగాల ప్రత్యేక గాలింపు, సహాయక బృందం నేపాల్ సైన్యంతో కలిసి ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నేపాల్‌లోని చిలిమే, లాంగ్‌టాంగ్ ప్రాంతాలలో ఉన్న కీలకమైన జలవిద్యుత్ సొరంగాల వద్ద సంయుక్త గాలింపు, సహాయక చర్యలు జోరందుకున్నాయి.
నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల (Flash floods) ధాటికి త్రిశూలి బేసిన్ పరిధిలోని జలవిద్యుత్ ప్రాజెక్టుల సొరంగాల్లో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తోన్న ఈ సంయుక్త ఆపరేషన్లపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, నేపాల్‌లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ స్పందిస్తూ.. నేపాల్ ఆర్మీతో కలిసి భారత సాంకేతిక నిపుణుల బృందం నిరంతరం రెస్క్యూ చర్యల్లో పాల్గొంటోందని స్పష్టం చేశారు. అధునాతన పరికరాలతో వెళ్లిన భారత బృందం కొండచరియలు, శిథిలాలు చిక్కుకుపోయిన వారి కోసం శోధిస్తోంది.
కాగా, నిన్న జలవిద్యుత్ ప్రాజెక్టు సైట్ నుంచి ఐదుగురు చైనా, ఏడుగురు భారత పౌరులతో కలిపి మొత్తం 15 మందిని సురక్షితంగా వెలికితీశారు. ఆకస్మిక వరదల వల్ల ఇప్పటివరకు నమోదైన మృతుల సంఖ్య 903కి చేరినట్లు నేపాల్ విపత్తు నిర్వహణ సంస్థ (NDRRMA) వెల్లడించింది.
మరో 4,247 మంది గల్లంతు కాగా, ఇందులో 592 మంది విదేశీయులు కూడా ఉన్నారు. రాసువా, నువాకోట్ జిల్లాలతో పాటు జలవిద్యుత్ ప్రాజెక్టు ప్రాంతాల నుంచి ఎక్కువ మంది పౌరులు, భద్రతా సిబ్బంది ఆచూకీ లభించాల్సి ఉంది. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఇప్పటివరకు మొత్తం 10,451 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ఇవి కూడా చదవండి...
వెలిగొండ ప్రాజెక్ట్ ఫేజ్-1ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానంటూ నమ్మించి మోసం.. జగన్‌పై ఎంపీ మాగుంట సీరియస్