ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతం.. భూమిపైకి చేరిన వ్యోమగాములు
ABN , Publish Date - Apr 11 , 2026 | 06:13 AM
నాసా ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతమైంది. వ్యోమగాములతో కూడిన ఒరాయన్ క్యాప్సూల్.. పసిఫిక్ మహాసముద్రంలో క్షేమంగా స్ప్లాష్ డౌన్ అయింది..
నాసా ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతమైంది. వ్యోమగాములతో కూడిన ఒరాయన్ క్యాప్సూల్.. పసిఫిక్ మహాసముద్రంలో క్షేమంగా స్ప్లాష్ డౌన్ అయింది.. శనివారం ఉదయం 5:38 గంటలకు కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో శాన్‌డియాగో తీరంలో ఆ దిగింది. వ్యోమగాములు రీడ్ వైజ్‌మాన్ (కమాండర్), విక్టర్ గ్లోవర్ (పైలట్), క్రిస్టినా కాచ్, జెరెమీ హాన్సెన్.. క్షేమంగా ఉన్నారని నాసా అధికారికంగా ప్రకటించింది. అర్ధశతాబ్ధం తర్వాత చంద్రుడి చెంతకు వెళ్లొచ్చిన వ్యోమగాములుగా రికార్డ్ సృష్టించారు. తిరుగు ప్రయాణంలో 25,000 మైళ్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశించిన వ్యోమగాములు.. 20 మైళ్ల వేగంతో పారాచూట్ల సహాయంతో సముద్రంపై దిగడం చరిత్రలో నిలిచిపోయింద నాసా అధికారులు తెలిపారు.
ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఏప్రిల్ 1న ఆర్టెమిస్-2 మిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. సుమారు 50 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో మనుషులు సుదూర ప్రయాణం చేయడంతో ఈ యాత్ర ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ మిషన్ ద్వారా వ్యోమగాములు.. 2,48,655 మైళ్ల దూరం ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించారు. గతంలో నాసా అపోలో-13 మిషన్ నెలకొల్పిన రికార్డును ఈ వ్యోమగాములు అధిగమించారు. చంద్రుని ఫార్ సైడ్ వరకూ వెళ్లిన వ్యోమగాములు.. భూమి, చంద్రుని మధ్య గురుత్వాకర్షణ తదితర అంశాలను పరీక్షించారు. భవిష్యత్తులో మళ్లీ చంద్రుడి పైకి మనుషులను పంపేందుకు.. ఈ మిషన్ కీలక ముందడుగు అని నాసా అధికారులు తెలిపారు.
ఈ వార్తలూ చదవండి:
200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!
ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్