200 మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్ అదృశ్యం!
ABN , Publish Date - Apr 10 , 2026 | 06:14 PM
హోర్ముజ్ జలసంధి గగనతలంలో అమెరికన్ డ్రోన్ కనిపించకుండా పోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. నిఘా మిషన్ అనంతరం డ్రోన్ ఇరాన్ వైపు మళ్లిన తరువాత కనిపించకుండా పోయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిపై ప్రయాణిస్తున్న ఒక అమెరికా నిఘా డ్రోన్ అకస్మాత్తుగా అదృశ్యం కావడం కలకలానికి దారి తీసింది. అత్యంత ఖరీదైన డ్రోన్‌గా పేరున్న ఎమ్‌క్యూ-4సీ ట్రైటన్ నేడు హోర్ముజ్ గగనతలంలో కనిపించకుండా పోయింది. ఎమర్జెన్సీ ప్రకటించిన కాసేపటికే డ్రోన్ కనిపించకుండా పోయిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. యూఎస్-ఇరాన్ చర్చల వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం కలకలానికి దారి తీసింది.
పర్షియన్ గల్ఫ్, హోర్ముజ్ జలాలపై నిఘా కోసం బయలుదేరిన డ్రోన్ దాదాపు మూడు గంటల తరువాత కనిపించకుండా పోయింది. ఫ్లైట్ రాడార్24 డేటా ప్రకారం, ఈ డ్రోన్ మిషన్ అనంతరం తిరిగొస్తూ ఇరాన్ వైపు మళ్లింది. ఆ తరువాత కాసేపటికే ఎమర్జెన్సీ (7700 కోడ్) ప్రకటించింది. ఈ క్రమంలో కిందకు దిగిన డ్రోన్ రాడార్ స్క్రీన్‌లపై కనుమరుగైంది. డ్రోన్‌ను ఎవరైనా కూల్చేశారా? లేక మరేదైనా సాంకేతిక లోపం తలెత్తిందా? అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.
డ్రోన్ ప్రత్యేకతలు ఇవీ..
దాదాపు 200 మిలియన్ డాలర్ల విలువైన ఈ డ్రోన్‌ను యూఎస్ సెంట్రల్ కమాండ్ పరిధిలోని గల్ఫ్ ప్రాంతంలో మోహరించారు. సముద్రజల్లాల్లో కీలక ప్రాంతాలపై ఎక్కువ సమయం పాటు నిఘా పెట్టేందుకు అమెరికా ఈ డ్రోన్‌ను వినియోగిస్తోంది. పీ-8ఏ పొసైడన్ పాట్రోల్ ప్లేన్స్‌కు అనుబంధంగా దీన్ని వినియోగిస్తున్నారు. 7,400 నాటికల్ మైళ్ల పరిధిలోని జలాలపై 50 వేల అడుగుల ఎత్తున ప్రయాణిస్తూ 24 గంటలకు పైగా నిఘా కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం ఈ డ్రోన్ సొంతమని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రస్తుతం యుద్ధం కారణంగా అమెరికాకు క్షణానికి రూ. 9.8 లక్షలు ఖర్చవుతున్నాయని మరికొందరు అంటున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్
పాకిస్థాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం