Share News

ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్

ABN , Publish Date - Apr 10 , 2026 | 03:41 PM

ఇజ్రాయెల్‌‌ను క్యాన్సర్‌‌గా అభివర్ణిస్తూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన పోస్టు వివాదాస్పదం కావడంతో ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా రంగంలోకి దిగారు. మంత్రితో ట్వీట్‌ను డిలీట్ చేయించారు.

ఇజ్రాయెల్ ఆగ్రహం! పాక్ మంత్రి ట్వీట్‌ను డిలీట్ చేయించిన ఆర్మీ చీఫ్

ఇంటర్నెట్ డెస్క్: మానవాళికి ఇజ్రాయెల్ ఒక శాపం అంటూ పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ పెట్టిన పోస్టు కలకలం రేపడంతో పాక్ ఆర్మీ చీఫ్ స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇజ్రాయెల్‌కు ఆగ్రహం తెప్పించిన ఆ ట్వీట్‌ను ఖవాజాతోనే డిలీట్ చేయించినట్టు తెలుస్తోంది. ఈ విషయాలను భారత ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పాక్ మంత్రి ట్వీట్‌తో యూఎస్-ఇరాన్ మధ్య శాంతి చర్చలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో ఆర్మీ చీఫ్ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని సమాచారం.

శాంతి చర్చలు కీలక దశలో ఉన్న వేళ పాక్ మంత్రి ఖవాజా ఇజ్రాయెల్‌ను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇజ్రాయెల్ దుర్మార్గమైన దేశమని, మానవాళికి శాపం అని పేర్కొన్నారు. ఓవైపు ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరుగుతుంటే లెబనాన్‌లో ఇజ్రాయెల్ మానవ హననానికి పాల్పడుతోందని విమర్శించారు. మొదట గాజా, ఆ తరువాత ఇరాన్, ఇప్పుడు లెబనాన్‌లో అమాయక పౌరులను పొట్టనపెట్టుకుంటోందని మండిపడ్డారు. ఇజ్రాయెల్ క్యాన్సర్ వ్యాధి లాంటిదని తీవ్ర విమర్శలకు దిగారు.


ఈ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌తో పాటు పాక్‌లోని వర్గాల నుంచి కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ చర్చల్లో తటస్థ దేశంగా పాక్ విశ్వసనీయత దెబ్బతినే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమైంది. పాక్ మంత్రి వ్యాఖ్యలతో ఉద్రిక్తతలు పెరిగి చర్చలకు బ్రేక్ పడితే గల్ఫ్ మళ్లీ రణరంగంగా మారుతుందని కొందరు ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ రంగంలోకి దిగి ట్వీట్ డిలీట్ చేయించారని సమాచారం. పాక్‌లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కంటే సైన్యానిదే పైచేయి అని ఈ ఉదంతంతో మరోసారి రుజువైందని కూడా విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

పాకిస్థాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం

ఆర్టెమిస్ 2 అప్‌డేట్ షేర్ చేసిన నాసా.. ఈ రోజే భూమి మీదకు..

Updated Date - Apr 10 , 2026 | 04:35 PM