పాదరసం నుంచి బంగారం!
ABN , Publish Date - Oct 25 , 2026 | 07:06 AM
అణు సంలీన (న్యూక్లియర్ ఫ్యూషన్) సాంకేతికతను వినియోగించి పాదరసం(మెర్క్యురీ)ను బంగారంగా మార్చగలిగామని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ‘మ్యారథాన్ ఫ్యూషన్’ సంస్థ తాజాగా ప్రకటించింది.
అణు సంలీనంతో తయారీకి అవకాశం
శాన్‌ఫ్రాన్సిస్కో, అక్టోబరు 24: అణు సంలీన (న్యూక్లియర్ ఫ్యూషన్) సాంకేతికతను వినియోగించి పాదరసం(మెర్క్యురీ)ను బంగారంగా మార్చగలిగామని అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ‘మ్యారథాన్ ఫ్యూషన్’ సంస్థ తాజాగా ప్రకటించింది. తాము అనుసరించిన ప్రక్రియను ‘అత్యుత్తమ స్థాయి రసవాదం(హై రేట్ ఆల్కెమీ)’గా అభివర్ణించింది. సాధారణంగా రసాయనిక ప్రక్రియలతో మూలకాలను మరో మూలకంగా మార్చడం అసాధ్యం. అణు సంలీనం తరహా ప్రక్రియతో మూలకం కేంద్రకంలో మార్పులు చేసి.. మరో మూలకంగా మార్చేందుకు అవకాశం ఉంటుంది. దీనిని ’న్యూక్లియర్ ట్రాన్స్‌మ్యూటేషన్’ అంటారు.
ఇప్పుడు ఈ విధానంలోనే పాదరసం నుంచి బంగారాన్ని రూపొందించామని.. ఇందుకోసం అణు సంలీన చర్యలో వెలువడిన అత్యంత శక్తివంతమైన న్యూట్రాన్లను వినియోగించామని మ్యారథాన్ ఫ్యూషన్ సంస్థ ప్రకటించింది. ఆ వివరాల మేరకు... పాదరసం (మెర్క్యురీ-198) మూలకాన్ని అత్యంత శక్తివంతమైన న్యూట్రాన్లతో ఢీకొట్టినప్పుడు.. దాని పరమాణువుల నుంచి ఒక న్యూట్రాన్‌ను కోల్పోయి, మెర్క్యురీ-197 ఐసోటో్‌పగా మారింది. ఈ ఐసోటో్‌పకు రేడియో ధార్మిక (రేడియేషన్) లక్షణాలు ఉంటాయి. ఈ క్రమంలో స్థిరత్వం కోసం మెర్క్యురీ-197 ఐసోటోప్ ఒక ప్రోటాన్‌ను కోల్పోయి, తర్వాత ఒక శక్తివంతమైన న్యూట్రాన్‌ను సంగ్రహించి.. బంగారం-197 ఐసోటో్‌పగా మారినట్టు కంపెనీ వెల్లడించింది.
ఎంత తయారైంది? నాణ్యత ఎంత?
యూరోపియన్ యూనియన్‌కు చెందిన అణు పరిశోధన సంస్థ ‘సెర్న్’ శాస్త్రవేత్తలు 2025లో లార్జ్ హైడ్రాన్ కొల్లైడర్ (ఎల్‌హెచ్‌సీ) పరికరంతో ప్రయోగాలు చేస్తున్న సమయంలో.. 29 పికోగ్రాముల(ఒక పికోగ్రాము అంటే గ్రాములో లక్షో వంతు) బంగారాన్ని తయారు చేసినట్టు ప్రకటించారు. సీసం(లెడ్) మూలకం నుంచి బంగారం ఉత్పత్తి అయినట్టు తెలిపారు. దానితో పోలిస్తే పదింతలు ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయగలిగామని మ్యారథాన్ ఫ్యూషన్ సంస్థ తాజాగా పేర్కొంది. భవిష్యత్తులో అణు సంలీన విద్యుత్ కేంద్రాలు(ఫ్యూషన్ పవర్ ప్లాంట్లు) అందుబాటులోకి వస్తాయని, ఒక్కో ప్లాంటులో ఏటా రెండు టన్నుల వరకు బంగారం ఉత్పత్తి చేయవచ్చని అంచనా వేసింది. అయితే, అణు సంలీన రియాక్టర్లు ఇప్పటికీ ప్రయోగదశలోనే ఉన్నాయి. అంటే ఇలా భారీగా బంగారం తయారు చేయడానికి దశాబ్దాల కాలం పట్టొచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్ ధర 2 లక్షలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News