మాల్దీవుల్లో విషాదం.. స్కూబా డైవింగ్ చేస్తూ ఐదుగురి మృతి
ABN , Publish Date - May 16 , 2026 | 07:48 PM
మాల్దీవుల్లో గురువారం విషాదం చోటుచేసుకుంది. సముద్ర గర్భంలోని గుహలను అన్వేషించే క్రమంలో ఐదుగురు స్కూబా డైవర్లు ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: పర్యాటక స్వర్గధామమైన మాల్దీవుల్లో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సముద్ర గర్భంలోని గుహలను అన్వేషించేందుకు వెళ్లిన ఐదుగురు ఇటాలియన్ స్కూబా డైవర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను మాల్దీవుల చరిత్రలోనే ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత పెద్ద డైవింగ్ విషాదంగా పేర్కొంటున్నారు అధికారులు.
డ్యూక్ ఆఫ్ యార్క్ అనే పడవ ద్వారా ఇటలీకి చెందిన పర్యాటకుల బృందం వావు అటోల్ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ సముద్ర మట్టానికి సుమారు 50 మీటర్ల లోతులో ఉన్న అండర్ వాటర్ కేవ్స్(నీటి లోపలి గుహలు) అన్వేషణ కోసం ఐదుగురు డైవర్లు సముద్రంలోకి దిగారు. అయితే.. ఉదయం డైవింగ్‌కు వెళ్లినవారు ఎంతసేపటికీ తిరిగి పైకి రాకపోవడంతో ఆందోళన మొదలైంది. దీనిపై సమాచారం అందుకున్న మాల్దీవుల కోస్ట్ గార్డ్.. ప్రత్యేక విమానాలు, నిపుణులైన డైవర్లతో సహాయక చర్యలను ప్రారంభించారు. తీవ్ర గాలింపు చర్యల అనంతరం.. దాదాపు 60 మీటర్ల లోతులో ఓ ఇరుకైన గుహమార్గంలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. మిగిలిన నలుగురి మృతదేహాలు సముద్ర గర్భంలోనే చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు అధికారులు. మృతులను మోనికా మోంటెఫాల్కోన్, జార్జియా సోమకాల్, ఫెడెరికో గ్వాల్టీరి, మురియెల్ ఒద్దెనినో, జియాన్లుకా బెనెడెట్టిలుగా గుర్తించారు.
అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. సముద్రంలో బలమైన ప్రవాహాలు, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటం సహా నీటిలో స్పష్టత లోపించడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. మిగిలిన మృతదేహాలను వెలికితీసేందుకు అధునాతన సాంకేతిక పరికరాలు, అదనపు రెస్క్యూ బృందాలను రంగంలోకి దించుతున్నారు అధికారులు.
మరోవైపు.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం ఇటలీ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఓ సీనియర్ డైవింగ్ నిపుణుడిని మాల్దీవులకు పంపింది. అక్కడి ఇటలీ రాయబారి కూడా మాలే చేరుకుని స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుని.. బాధితుల కుటుంబాలకు అవసరమైన సాయమందిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది? గుహల్లో వారు ఎందుకు చిక్కుకుపోయారు? అనే విషయాలపై అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:
అక్టోబర్ 7 దాడుల సూత్రధారి హతం.. ఇజ్రాయెల్ ప్రకటన..
ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు.. అమెరికా ప్రకటన..