Share News

ఖమేనీ మృతి తర్వాత పాకిస్థాన్‌లో నిరసనలు.. 12మంది మృతి

ABN , Publish Date - Mar 01 , 2026 | 05:35 PM

అమెరికా, ఇజ్రాయెల్‌ చేసిన భీకర దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది. అక్కడ జరిగిన ఘర్షణల్లో 12మంది మృతిచెందారు.

ఖమేనీ మృతి తర్వాత పాకిస్థాన్‌లో నిరసనలు.. 12మంది మృతి
Karachi protest news

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్‌ చేసిన భీకర దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్థాన్‌ (Pakistan)లోని కరాచీలో ఉద్రిక్తత నెలకొంది. ఖమేనీ మృతికి నిరసనగా పాకిస్థాన్‌లోని యూఎస్‌ కాన్సులేట్‌ (US Consulate)పై నిరసనకారులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో 12మంది మృతిచెందారు. మరో 30మందికిపైగా గాయపడ్డారు.


ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ(Ayatollah Ali Khamenei) మృతి ప్రభావం పాకిస్థాన్‌పై పడింది. అక్కడ నిరసనకారులు అమెరికా రాయబార కార్యాలయంపై దాడికి వెళ్లారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న నిరసనకారులు కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత నిప్పంటించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ ఉపయోగించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో 12మంది మరణించారు. మరో 30 మందికి పైగా గాయపడ్డారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో నిరసనకారులు ప్రధాన ద్వారం పగలగొట్టి కాన్సులేట్ ఆవరణలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోంది.


రిసెప్షన్, భద్రతా గదుల కిటికీలు పగులగొట్టారు. కొంతమంది యువకులు ప్రధాన ద్వారం ఎక్కి డ్రైవ్‌వేలోకి వెళ్లడం వీడియోలో కనిపించింది. ముళ్ల తీగలతో చుట్టుముట్టబడిన కాంపౌండ్ పైన యూఎస్ జెండా ఎగురుతూ కనిపించింది. మరోవైపు పాక్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం ఖమేనీ మృతిపై సంతాపం తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌ ఆయన్ను టార్గెట్ గా చేసుకోవడాన్ని పిరికిపంద చర్యగా పేర్కొంది. ఇక, ఖమేనీ మృతికి వ్యతిరేకంగా ఇరాక్‌లోనూ ఆందోళనలు చెలరేగాయి. బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై నిరసనకారులు దాడి చేశారు. భద్రతా దళాలు వారిని చెదరగొట్టేందుకు టియర్‌ గ్యాస్‌ను ఉపయోగించాయి. అక్కడ పలువురికి గాయాలయ్యాయి.


ఇవి కూడా చదవండి..

ఖమేనీ మృతితో ముగ్గురి సభ్యుల కౌన్సిల్ చేతికి పాలనా పగ్గాలు

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?

Updated Date - Mar 01 , 2026 | 06:19 PM