Share News

మరో వివాదంలో జెన్సన్ హువాంగ్‌.. అంతర్గత విచారణ చేపట్టిన ఎన్విడియా..!

ABN , Publish Date - Nov 16 , 2026 | 11:47 AM

ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వివాహేతర సంబంధాలు, సీఈఓ పదవిని కోల్పోవడం వంటి అంశాలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు.

మరో వివాదంలో జెన్సన్ హువాంగ్‌.. అంతర్గత విచారణ చేపట్టిన ఎన్విడియా..!
Jensen Huang

ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 16: ఎన్విడియా (NVIDIA) సహ వ్యవస్థాపకుడు, ఆ సంస్థ మాజీ సీఈఓ జెన్సన్ హువాంగ్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే వివాహేతర సంబంధాలు, సీఈఓ పదవిని కోల్పోవడం వంటి అంశాలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఉద్యోగ, వ్యక్తిగత సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు హువాంగ్‌. ఎన్విడియాలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అజయ్ కె. పూరిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి.


ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన కంపెనీ సమావేశంలో 30 మందికి పైగా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అజయ్ పూరిని ఉద్దేశించి హువాంగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 'నీకు ఫ్లూ రావాలని, అది మరింత తీవ్రం కావాలని కోరుకుంటున్నా. ఆ తర్వాత నువ్వు చనిపోయి మా అందరి బాధను తీర్చాలని నేను కోరుకుంటున్నా' అని హువాంగ్ అన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆ సంస్థ విచారణ చేపట్టినట్లు సమాచారం. అయితే, ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.


కాగా, అజయ్ కె. పూరి 2005లో ఎన్విడియాలో చేరారు. సంస్థలో సుమారు 21 ఏళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వహించారు. వరల్డ్‌వైడ్ ఫీల్డ్ ఆపరేషన్స్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ అమ్మకాలు, వ్యాపార విస్తరణ, కస్టమర్ సంబంధాలను పర్యవేక్షించారు. ఎన్విడియాలో చేరకముందు సన్ మైక్రోసిస్టమ్స్‌లో 22 ఏళ్లపాటు పనిచేశారు. 2026 జులై 2న ఎన్విడియాలో వరల్డ్‌వైడ్ ఫీల్డ్ ఆపరేషన్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలగాలని ఆయన నిర్ణయించుకున్నారు. రెండు దశాబ్దాలకు పైగా సంస్థ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన అజయ్ పూరిపై హువాంగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ఎన్విడియా పగ్గాలు మళ్లీ హువాంగ్ చేతికేనా?.. రంగంలోకి టెక్ దిగ్గజాలు..!

పాకిస్థాన్‌, టర్కీ మధ్య భారీ డ్రోన్ డీల్.. లక్ష మెర్కుట్ ఎఫ్‌పీవీ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం

Updated Date - Nov 16 , 2026 | 11:47 AM