Share News

ఎన్విడియా పగ్గాలు మళ్లీ హువాంగ్ చేతికేనా?.. రంగంలోకి టెక్ దిగ్గజాలు..!

ABN , Publish Date - Nov 16 , 2026 | 07:38 AM

ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్ మళ్లీ కంపెనీ పగ్గాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టేలా సిలికాన్ వ్యాలీకి చెందిన పలువురు ప్రముఖ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు ఏకమవుతున్నట్లు సమాచారం.

ఎన్విడియా పగ్గాలు మళ్లీ హువాంగ్ చేతికేనా?.. రంగంలోకి టెక్ దిగ్గజాలు..!
Jensen Huang

వాషింగ్టన్, నవంబర్ 16: ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేసిన జెన్సన్ హువాంగ్ మళ్లీ కంపెనీ పగ్గాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టేలా సిలికాన్ వ్యాలీకి చెందిన పలువురు ప్రముఖ టెక్ ఎగ్జిక్యూటివ్‌లు ఏకమవుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా ‘వార్ రూమ్’ ఏర్పాటు చేస్తున్నారని, ఎన్విడియా బోర్డుతో పాటు అమెరికా ప్రభుత్వ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారని హువాంగ్‌కు సన్నిహితుడైన ఒకరు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. హువాంగ్ తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టాలన్న ప్రయత్నాలకు తానూ మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.


ఈ ప్రముఖుల బృందం ప్రధానంగా రెండు లక్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్విడియా బోర్డు డైరెక్టర్లను ఒప్పించి హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించేలా ప్రయత్నించడం, మరోవైపు అమెరికా ప్రభుత్వ మద్దతు పొందడం ఈ ప్రయత్నాల్లో కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్, ఎపిక్ గేమ్స్ సీఈఓ టిమ్ స్వీనీ కూడా హువాంగ్‌ను తిరిగి తీసుకురావాలని కోరుతూ వచ్చిన బహిరంగ లేఖకు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా.. హువాంగ్ స్థానంలో కొత్త సీఈఓను నియమించే అంశంపైనా ఎన్విడియా బోర్డు దృష్టి సారించింది. బ్రిటన్‌కు చెందిన చిప్ డిజైన్ సంస్థ ఆర్మ్ హోల్డింగ్స్ సీఈఓ రెనే హాస్ పేరును పరిశీలించినట్లు సమాచారం. అయితే కొత్త సీఈఓ నియామకంపై బోర్డు నుంచి తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు.


ప్రస్తుతం ఎన్విడియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కోలెట్ క్రెస్ తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హువాంగ్ రాజీనామా నేపథ్యంలో కంపెనీ నాయకత్వంపై నెలకొన్న అనిశ్చితి మధ్య ఆయన పునరాగమన ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపడతారా లేదా అన్నది ఎన్విడియా బోర్డు నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గుతున్నాయ్..

బహ్రెయిన్‌లో వేడుకగా శ్రీ వేంకటేశ్వర కల్యాణ మహోత్సవం

Updated Date - Nov 16 , 2026 | 07:38 AM