Share News

పాక్‌ ప్రమేయంతో రైల్వే లైన్‌పై పేలుడు

ABN , Publish Date - Nov 16 , 2026 | 03:34 AM

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లా 50జీబీ గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై ఈ నెల మూడో తేదీన చోటు చేసుకున్న పేలుడు పాకిస్థాన్‌ ప్రమేయంతో జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

పాక్‌ ప్రమేయంతో రైల్వే లైన్‌పై పేలుడు

  • మహిళ సహా ఇద్దరి అరెస్టు

జైసల్మీర్‌, నవంబరు 15: రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌ జిల్లా 50జీబీ గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై ఈ నెల మూడో తేదీన చోటు చేసుకున్న పేలుడు పాకిస్థాన్‌ ప్రమేయంతో జరిగిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. రాజస్థాన్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ అదనపు డీజీపీ దినేష్‌ వివరాలను వెల్లడించారు. ఈ కేసులో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు చెందిన మహక్‌దీప్‌ కౌర్‌ (21), దవీందర్‌ సింగ్‌(23)లను అరెస్టు చేసినట్టు చెప్పారు. పాకిస్థాన్‌లో ఉండే షా అనే వ్యక్తి ఆ దేశ గూఢచారి సంస్థ ఐఎస్ఐకి ఏజెంటుగా పని చేస్తున్నాడని, రొమాంటిక్‌ సంబంధం పేరుతో కౌర్‌ను వలలో వేసుకొని ఈ దాడికి ప్రోత్సహించాడని తెలిపారు. ఇందుకు రూ.2.23 లక్షలు చెల్లించాడని వివరించారు. పంజాబ్‌ పోలీసులు గురుదాస్‌పూర్‌ లో సోదాలు జరిపి నిందితుల వద్ద నుంచి రెండు విదేశీ పిస్టళ్లు, 46 తూటాలు, రూ.30వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. కౌర్‌కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలానికేభర్త కరణ్‌వీర్‌సింగ్‌ నుంచి విడిపోయింది. 2025 ఫిబ్రవరిలో కరణ్‌వీర్‌ మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయ్యాడు. జైలు నుంచే అతడు మళ్లీ కౌర్‌తో సంబంధాలు పెట్టుకొని పాకిస్థాన్‌లోని లవ్లీ అనే వ్యక్తితో మాట్లాడాలని చెప్పాడు. ఆ లవ్లీయే ఆమెను షాకు పరిచయం చేశాడు.

Updated Date - Nov 16 , 2026 | 03:35 AM