Share News

పాకిస్థాన్‌, టర్కీ మధ్య భారీ డ్రోన్ డీల్.. లక్ష మెర్కుట్ ఎఫ్‌పీవీ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం

ABN , Publish Date - Nov 16 , 2026 | 10:38 AM

ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన మానవ రహిత యుద్ధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకునేందుకు సిద్ధమైంది.

పాకిస్థాన్‌, టర్కీ మధ్య భారీ డ్రోన్ డీల్.. లక్ష మెర్కుట్ ఎఫ్‌పీవీ డ్రోన్ల కొనుగోలుకు ఒప్పందం
MERKÜT FPV Drone

ఇస్లామాబాద్, నవంబర్ 16: ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల వినియోగం అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన మానవ రహిత యుద్ధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా టర్కీకి చెందిన రక్షణ సాంకేతిక సంస్థ పసిఫిక్ టెక్నాలజీ (Pasifik Teknoloji) నుంచి ఏకంగా లక్ష మెర్కుట్ (MERKÜT) ఎఫ్‌పీవీ డ్రోన్లను కొనుగోలు చేయనుంది. ఈ మేరకు పాకిస్థాన్‌కు చెందిన నేషనల్ రేడియో అండ్ టెలికమ్యూనికేషన్ కార్పొరేషన్ (NRTC), టర్కీ సంస్థ మధ్య మూడేళ్ల ఒప్పందం కుదిరినట్లు రక్షణ రంగ నివేదికలు వెల్లడించాయి.


ఈ ఒప్పందం కేవలం లక్ష ఎఫ్‌పీవీ డ్రోన్లకే పరిమితం కాలేదు. పాకిస్థాన్ సైన్యం కోసం మరో నాలుగు రకాల మానవ రహిత వ్యవస్థలను కూడా టర్కీ సంస్థ సరఫరా చేయనుంది. వాటిలో 10 ఆల్పిన్ (ALPİN) హెలికాప్టర్లు, 25 డుమ్రుల్ (DUMRUL) మినీ హెలికాప్టర్లు, 500 డెలి (DELİ) లాయిటరింగ్ మ్యూనిషన్స్, 250 కోర్గాన్ (KORGAN) గ్రౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఆయా వ్యవస్థల సరఫరా, విక్రయాలు, పంపిణీతో పాటు పాకిస్థాన్‌లోనే వాటి ఉత్పత్తి, అసెంబ్లీ కూడా చేపట్టనున్నారు.


అయితే, ఈ ఒప్పందంలో ప్రధాన ఆకర్షణగా మెర్కుట్ ఎఫ్‌పీవీ (First-person view) డ్రోన్ నిలుస్తోంది. ఈ డ్రోన్‌లో అమర్చిన కెమెరా ద్వారా అందే ప్రత్యక్ష దృశ్యాల ఆధారంగా ఆపరేటర్ దాన్ని నియంత్రించగలుగుతాడు. ఇది దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు గాలిలో ఎగరగలదు. అలాగే, సుమారు 8 కిలోమీటర్ల పరిధిలో పనిచేయగలదు. ఇందులో 3 మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన వెయ్యి స్టీల్ బాల్స్‌తో కూడిన వార్‌హెడ్ ఉంటుంది. దీని పేలుడు ప్రభావ పరిధి 20 మీటర్ల వరకు ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి.


కాగా, ఈ భారీ ఒప్పందం టర్కీ, పాకిస్థాన్ మధ్య పెరుగుతున్న రక్షణ సహకారానికి ఉదాహరణగా నిలుస్తోంది. ఇప్పటికే టర్కీకి చెందిన ఐదో తరం కేఏఏఎన్ (KAAN) యుద్ధ విమానాల తయారీ కోసం ఇరు దేశాలు సంయుక్త ప్రణాళికలను ప్రకటించాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ఎన్విడియా పగ్గాలు మళ్లీ హువాంగ్ చేతికేనా?.. రంగంలోకి టెక్ దిగ్గజాలు..!

బ్రేకప్ చెప్పిందని ఇంతటి ఘాతుకమా?.. మాజీ ప్రియురాలి కుక్కలను చంపి వీడియో కాల్..

Updated Date - Nov 16 , 2026 | 10:53 AM