ట్రంప్ మాటల్ని పట్టించుకోని ఇజ్రాయెల్!.. ఇరాన్‌పై ప్రతీకార దాడులు
ABN , Publish Date - Jun 08 , 2026 | 08:34 AM
అంతర్జాతీయ సమాజం ఎంత చెప్తున్నా, చివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టిగా హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ లోపలికి దూసుకెళ్లి మరి ప్రతీకార దాడులకు దిగింది.
టెల్ అవీవ్, జూన్ 8: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తమ భూభాగంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడులకు ఇజ్రాయెల్ గట్టిగా బదులిచ్చింది. ఇరాన్ లోపలికి దూసుకెళ్లిన ఇజ్రాయెల్ వైమానిక దళం (IAF).. అక్కడ భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. 'పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని ఇరానియన్ ఉగ్రవాద పాలనకు చెందిన సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం కొద్దిసేపటి క్రితమే విజయవంతంగా దాడులు చేసింది' అని IDF తమ ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
ట్రంప్ హెచ్చరికలను పక్కనబెట్టి..
ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి, ఇరాన్‌పై ఎలాంటి ప్రతీకార దాడులు చేయవద్దని సూచించినట్లు అంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే, అమెరికా ఒత్తిడిని, హెచ్చరికలను పక్కనబెట్టి నెతన్యాహు ప్రభుత్వం.. ఇరాన్‌పై నేరుగా సైనిక చర్యకు దిగడం అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత అటు లండన్ కూడా ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరినప్పటికీ ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. తద్వారా తమ దేశ రక్షణ విషయంలో ఎవరి మాట వినే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ పరోక్షంగా తేల్చిచెప్పింది.
వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా..
పశ్చిమ, మధ్య ఇరాన్ ప్రాంతాల్లోని ఇరాన్ సైన్యానికి సంబంధించిన కీలక క్షిపణి కేంద్రాలు, డ్రోన్ తయారీ స్థావరాలు, రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇరాన్ వైపు జరిగిన నష్టం గురించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఏప్రిల్ 8న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్.. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దానికి ప్రతిచర్యగా ఇజ్రాయెల్ ఇప్పుడు నేరుగా ఇరాన్ భూభాగంపైనే వైమానిక దాడులకు దిగింది.

ఈ వార్తలనూ చదవండి:
దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలపై దృష్టి పెట్టాము: ఎల్ఐసీ సీఈఓ
ఆచితూచి అడుగేయండి.. ఇన్వెస్టర్లకు నిపుణులు సూచన