Share News

ఇరాన్ యుద్ధనౌకపై సబ్‌మెరైన్ దాడి.. 87 మంది దుర్మరణం

ABN , Publish Date - Mar 04 , 2026 | 08:36 PM

శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ ఘటనలో 87 మృతి చెందినట్టు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.

ఇరాన్ యుద్ధనౌకపై సబ్‌మెరైన్ దాడి.. 87 మంది దుర్మరణం
Iranian Warship

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా జలాంతర్గామి చేసిన దాడిలో 87 మంది మృతిచెందినట్టు రాయిటర్స్ మీడియా తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన సమయంలో ఆ నౌకలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. శ్రీలంక చేపట్టిన సహాయక చర్యల్లో భాగంగా ఇప్పటివరకు 32 మందిని రక్షించగా.. గల్లంతైన మిగిలిన వారి ఆచూకీ తెలియాల్సి ఉంది. పశ్చిమాసియలో ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీలంక దక్షిణ తీరానికి సమీపంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.


ఇరాన్‌కు చెందిన ఐఆర్ఐఎస్ దేనా అనే ఈ యుద్ధనౌక కొన్ని వారాల క్రితం.. భారత్‌లోని విశాఖపట్నంలో జరిగిన ‘మిలాన్-2026’ విన్యాసాల్లో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటనలో ఎంతమంది మరణించారనే విషయాన్ని అమెరికా అధికారికంగా వెల్లడించనప్పటికీ.. ఆ దేశ రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ తామే ఈ దాడిచేసినట్టు ధ్రువీకరించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఓ శత్రు దేశానికి చెందిన యుద్ధనౌకను అమెరికన్ సబ్‌మెరైన్‌ టార్పెడోతో ధ్వంసం చేయడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. శత్రువులకు ఎక్కడా రక్షణ లేదని నిరూపించడమే తమ లక్ష్యమని ఆయన హెచ్చరించారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను కూడా అమెరికా విడుదల చేసినట్టు సమాచారం.


అమెరికా నావికాదళానికి చెందిన సబ్‌మెరైన్ నుంచి ప్రయోగించిన టార్పెడో ద్వారా దాడిచేసినట్టుగా పెంటగాన్ ప్రకటించింది. శ్రీలంకలోని గాలే నగరానికి సుమారు 44 నాటికల్ మైళ్ల దూరంలోని అంతర్జాతీయ జలాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే.. ఇరాన్ నౌక నుంచి అత్యవసర సంకేతాలు అందుకున్న వెంటనే శ్రీలంక నౌకాదళం స్పందించింది. గాలే సమీప సముద్ర జలాల్లోకి రక్షణ బృందాలు వేగంగా చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఇప్పటివరకు 32 మంది సిబ్బందిని రక్షించగా.. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


ఇవీ చదవండి:

ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: లోకేశ

చిన్నారి ప్రాణం తీసిన బెలూన్

Updated Date - Mar 04 , 2026 | 09:17 PM