Share News

మార్చి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు: ఏపీఎస్డీఎంఏ

ABN , Publish Date - Mar 04 , 2026 | 07:53 PM

ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏడాదికోసారి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మార్చి నుంచే సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో నమోదవుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

మార్చి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు: ఏపీఎస్డీఎంఏ
APSDMA

అమరావతి, మార్చి 04: రాష్ట్రంలో రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు పొగలు కక్కుతున్నాడు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ఈ ఏడాది వేసవి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గతేడాది కంటే ఈసారి కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.


ఏపీఎస్డీఎంఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నుంచే సాధారణం కంటే ఎక్కవ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో ఎక్కువ రోజులు వడగాలులు వీచవచ్చని అంచనా వేసింది.

మార్చి నుంచి మే నెల వరకు శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఇక.. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే వీలుందని చెప్పింది.


ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఏపీఎస్డీఎంఏ చర్యలు చేపడుతోందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఎండ తీవ్రతపై ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుందని ఆయన అన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయ చర్యలతో ప్రాణనష్టాన్ని తగ్గించగలుగుతుందని చెప్పారు. ఎండలపై మరింత సమాచారం కోసం విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు: 112, 1070, 18004250101లను సంప్రదించాలని సూచించారు.


ఇవీ చదవండి:

ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: లోకేశ

చిన్నారి ప్రాణం తీసిన బెలూన్

Updated Date - Mar 04 , 2026 | 07:53 PM