వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: లోకేశ్
ABN , Publish Date - Mar 04 , 2026 | 06:12 PM
ఐటీ కంపెనీలపై గత వైసీపీ ప్రభుత్వం యుద్ధం చేసిందని.. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విమర్శించారు.
అమరావతి, మార్చి 04: రాష్ట్రంలోని ఐటీ కంపెనీలపై గత వైసీపీ ప్రభుత్వం యుద్ధం చేసిందని.. అందువల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. 2014-19 మధ్య ఏపీకి వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. బుధవారం నాడు అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. ఫార్చ్యూన్ 500లోని ఒక కంపెనీని విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే వారిని సైతం వెళ్లగొట్టిందంటూ వైసీపీ గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
టెర్రరిజం మాదిరిగా వ్యవహరించి కంపెనీలను పంపించారంటూ ఆ పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు లోకేశ్. తాము మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. సదరు కంపెనీలతో మాట్లాడితే గత అనుభవాలను చెప్పి వారు ఆందోళన వెలిబుచ్చారని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వారిని ఒప్పించి కంపెనీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. 8 రకాల పాలసీలు తీసుకువచ్చి కంపెనీలకు మార్గం సుగమం చేశామని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
సభలో లేకుండా బయట ఏదేదో ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా లోకేశ్ ఎండగట్టారు. నానో కంపెనీ ఏర్పాటుపై పశ్చిమ బెంగాల్‌లో పెద్దఎత్తున ఆందోళన జరిగితే.. నరేంద్ర మోదీ సీఎంగా ఉన్న గుజరాత్‌కు ఆ సంస్థను ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. తద్వారా గుజరాత్‌లో ఆ పరిశ్రమ ఏర్పాటైందన్నారు.
దీంతో గుజరాత్‌లో ఆ సంస్థ ఆర్థిక కార్యకలాపాలు జోరందుకున్నాయని వివరించారు. ఇదే అంశాన్ని తాము స్ఫూర్తిగా తీసుకున్నామని పేర్కొన్నారు. వివిధ సంస్థలకు రూపాయికి భూములు ఇవ్వడంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతల తీరును ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ తూర్పారబట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చిత్తూరు జిల్లా తుమ్మిందపాలెంలో దారుణం..
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లా పని చేస్తున్న ఉన్నతాధికారులు: బాల్క సుమన్
Read Latest AP News And Telugu News