మిమ్మల్ని వెతికి పట్టుకుంటాం.. అమెరికా నేవీ అధికారులకు ఇరాన్ హెచ్చరిక!
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:42 PM
ఇరాన్‌లోని మినాబ్ నగరంలోని బాలికల పాఠశాలపై జరిగిన క్షిపణి దాడికి బాధ్యులంటూ ఇద్దరు అమెరికా నేవీ అధికారుల పేర్లను గతంలో ప్రస్తావించిన ఇరాన్.. తాజాగా వారిని లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్నాయి. తమ దేశంలోని మినాబ్ నగరంలో బాలికల పాఠశాలపై జరిగిన క్షిపణి దాడికి బాధ్యులంటూ ఇద్దరు అమెరికన్ నేవీ అధికారుల పేర్లను గతంలో ప్రస్తావించిన ఇరాన్.. తాజాగా వారిని లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేసింది. ‘మిమ్మల్ని వెతికి పట్టుకుంటాం’ అంటూ ఇరాన్ దౌత్య కార్యాలయం చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చకు దారి తీశాయి.
ఇద్దరు అధికారుల పేర్లను వెల్లడించిన ఇరాన్
దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం నవంబర్ 13న ఎక్స్ వేదికగా ఈ హెచ్చరికలను జారీ చేసింది. గత మార్చి 28న ఇద్దరు అమెరికా నేవీ అధికారుల ఫొటోలతో చేసిన పోస్టును మళ్లీ రీషేర్ చేస్తూ.. ‘మిమ్మల్ని వెతికి పట్టుకుంటాం’ అని పేర్కొంది. ఇరాన్ ప్రస్తావించిన అధికారుల్లో కమాండర్ లీ ఆర్ టేట్ (Leigh R. Tate), లెఫ్టినెంట్ కమాండర్ జెఫ్రీ ఈ.యార్క్ (Jeffrey E. York) ఉన్నారు. వీరిలో టేట్ యూఎస్‌ఎస్ స్ప్రూయాన్స్ యుద్ధనౌకకు కమాండింగ్ ఆఫీసర్‌గా, యార్క్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మినాబ్ పాఠశాలపై మూడుసార్లు టోమాహాక్ క్షిపణులను ప్రయోగించాలని ఈ ఇద్దరు అధికారులే ఆదేశించారని ఇరాన్ ఆరోపించింది. ఈ దాడిలో 168 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.
అసలు మినాబ్ పాఠశాలలో ఏం జరిగింది?
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులు ప్రారంభమైన సమయంలో దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలో ఉన్న బాలికల పాఠశాలపై క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఇతరులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 168 మంది చిన్నారులు మరణించారని ఇరాన్ తెలిపింది. అయితే మృతుల సంఖ్యపై వివిధ నివేదికల్లో తేడాలున్నాయి. ఈ దాడికి తమ దేశ బలగాలే కారణమై ఉండవచ్చని అమెరికా మీడియాలో కథనాలూ వచ్చాయి.
ఈ వార్తలూ చదవండి
తమిళనాడులో సంచలనం.. భార్యతో విడాకులు తీసుకుంటున్న మంత్రి..
మరో వివాదంలో జెన్సన్ హువాంగ్.. అంతర్గత విచారణ చేపట్టిన ఎన్విడియా..!