Share News

Ayatollah Khamenei: మాపై దృష్టిపెట్టడం ఆపు.. ట్రంప్‌కు ఇరాన్ సుప్రీం ఖమేనీ వార్నింగ్

ABN , Publish Date - Jan 11 , 2026 | 10:53 AM

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసనలు జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు. అహంకారంతో ఉంటే నాశనం తప్పదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చారు.

Ayatollah Khamenei: మాపై దృష్టిపెట్టడం ఆపు.. ట్రంప్‌కు ఇరాన్ సుప్రీం ఖమేనీ వార్నింగ్
Ayatollah Khamenei

ఇరాన్, జాతీయం10: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్‌లో నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. ఈ ఆందోళనపై చాలా రోజుల తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ(Ayatollah Khamenei) స్పందించారు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని సహించబోమంటూ ఆందోళనకారులను హెచ్చరించారు.


అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు(Trump warning) వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్‌ ఆందోళనలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. 'కొందరు మన దేశ వీధులను పాడుచేసి.. మరో దేశ అధ్యక్షుడిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసం రోడ్డెక్కి దేశ పరువు తీయొద్దు. విదేశీ శక్తుల చేతుల్లో కిరాయి సైనికుల్లా వ్యవహరించే వారిని ఇస్లామిక్ రిపబ్లిక్ సహించబోదు. అలానే ఈ సమయంలో ఇరాన్‌ యువత ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఎలాంటి శత్రువునైనా ఇరాన్‌ ఎదుర్కోగలుగుతుంది' అని ఖమేనీ అభిప్రాయపడ్డారు.


ఇతర దేశాలకు నీతులు చెప్పే ముందు సొంత దేశంపై దృష్టిపెట్టాలంటూ ఖమేనీ హితవు పలికారు. ‘అహంకారంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఓ విషయం తెలుసుకోవాలి. ఫారో, నిమ్రోద్, మహమ్మద్ రెజా వంటి ప్రపంచంలోని అహంకార నాయకులు తమ గర్వం పరాకాష్టకు చేరిన క్షణంలోనే పతనమయ్యారు. ట్రంప్ కూడా అదే గతి పడుతుంది'.. అని అయతొల్లా అలీ ఖమేనీ ఆ పోస్ట్‌లో రాశారు.


మరోవైపు నిరసనలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో ఇరాన్‌లో మరింత కఠినమైన చర్యలు తప్పవని తెలుస్తోంది. శనివారం ఆ దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెది ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ.. నిరసనలలో పాల్గొనే ఎవరినైనా శత్రువుగా పరిగణిస్తామని, అలాంటి వారికి మరణశిక్ష విధిస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 2026 ఆర్థిక బడ్జెట్‌పై ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఆర్థిక సంక్షోభంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, తారాస్థాయికి చేరుకున్న నిరుద్యోగ సమస్యతో పాటూ రాజకీయ స్వేచ్ఛకు భంగం కలగడంతో.. ఇరాన్‌ వ్యాప్తంగా ఆందోళనలు (Iranian youth protests) మొదలయ్యాయి. 2025 డిసెంబర్ 28న మొదలై.. ప్రస్తుతం 27 ప్రావిన్సుల్లో 250కి పైగా ప్రాంతాలకు నిరసనలు విస్తరించాయి.


ఇవి కూడా చదవండి..

రిపబ్లిక్ డే సేల్‌కు రెడీ అవుతున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటి నుంచంటే..

పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jan 11 , 2026 | 11:28 AM