Iran Protests Escalate: నారి బిగించిన ఉద్యమం
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:13 AM
ఇరాన్‌లో మహిళలు ‘కట్టుబాటు’ సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛ కోసం పొలికేక పెడుతున్నారు. ప్రభుత్వం బలవంతంగా తొడిగిన ముసుగులను లాగిపడేసి మంటల్లో.....
ఇరాన్‌లో ప్రజా తిరుగుబాటు తీవ్రతరం..
ముందుండి నడిపిస్తున్న మహిళలు
దేశమంతా పాకిన ఖమేనీ వ్యతిరేక ఉద్యమం..
నగరాలను ఆక్రమించాలని యువరాజు రెజా పహ్లవి పిలుపు
టె హ్రాన్, జనవరి 10: ఇరాన్‌లో మహిళలు ‘కట్టుబాటు’ సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛ కోసం పొలికేక పెడుతున్నారు. ప్రభుత్వం బలవంతంగా తొడిగిన ముసుగులను లాగిపడేసి మంటల్లో ఆహుతి చేస్తున్నారు. ఇస్లామిక్ మతపెద్ద అయతొల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లో కదం తొక్కుతున్నారు. పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా వేలమంది ఉద్యమకారులు ‘ఖమేనీ చావనీ’ అంటూ గర్జిస్తున్నారు. మహిళలపై అడుగడుగునా ఆంక్షలు ఉండే ఇరాన్‌లో.. దాదాపు రెండు వారాలుగా ఉద్యమానికి మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి ఖమేనీ అధికారాన్ని కూలదోయటమే లక్ష్యంగా పోరాడుతున్నారు. ఇరాన్‌లో ఖమేనీ చిత్రపటాలను అవమానించటం, తగులబెట్టడం తీవ్రమైన నేరం. ఇప్పుడు మహిళలు దానినే అస్త్రంగా మార్చుకున్నారు. ఓ యువతి ఖమేనీ ఫొటోకు నిప్పు పెట్టి, ఆ మంటతో సిగరెట్ వెలిగించుకుంటున్న ఫొటో ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇరాన్‌లో మహిళల ధూమపానం కూడా నిషిద్ధమే. ఆ దేశంలో మహిళలు బయటకు వెళ్లాలంటే జుట్టు కనపడకుండా హిజాబ్ కప్పుకోవటం తప్పనిసరి. తాజా నిరసనల్లో మహిళలు తమ హిజాబ్‌లను మంటల్లో కాల్చివేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు.
మీ పాలనే వద్దు..
గతంలో మహిళలు కఠినమైన నిబంధనలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయగా, తాజా నిరసనల్లో ఇస్లామిక్ రిపబ్లిక్ పాలనే వద్దనే నినాదం బలంగా వినిపిస్తోంది. ఇరాన్‌లో 1979లో వచ్చిన ఇస్లామిక్ విప్లవం తర్వాత నుంచి ఖమేనీల కనుసన్నల్లోనే పాలన అంతా సాగుతోంది. తాజాగా ప్రజలు ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన పోయి.. ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు మాత్రం తిరిగి పహ్లవి రాజవంశ పాలనను కోరుకుంటున్నారు. టెహ్రాన్‌లో జరిగిన నిరసనల్లో ముఖానికి రక్తం పూసుకుని పాల్గొన్న ఓ వృద్ధురాలు.. ‘నాకు భయం లేదు.. ఎందుకంటే నేను 47 ఏళ్ల క్రితమే మరణించాను’ అని నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అయ్యింది. ‘ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న విప్లవానికి ఇరాన్ యువతులే నాయకత్వం వహిస్తున్నారు’ అని డాక్టర్ మాలోఫ్ అనే రాజకీయ విశ్లేషకుడు ట్వీట్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 28న మొదలైన తాజా ఉద్యమం.. రాజధాని నగరం టెహ్రాన్‌ను దాటి దేశం నలుమూలలకు పాకింది.
శనివారం రాత్రి టెహ్రాన్‌లో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. వేలమంది ప్రజలు ఇందులో పాల్గొన్నారు. మరోవైపు అమెరికాలో ఉంటున్న పహ్లవి రాజవంశ యువరాజు రెజా పహ్లవి.. ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలు తెలపటం మాత్రమే కాకుండా నగరాలను పూర్తిగా ఆక్రమించాలని సూచించారు. కాగా, నిరసనకారులపై ప్రభుత్వం కూడా కఠినమైన అణచివేత చర్యలకు దిగుతోంది. ఒక్క టె హ్రాన్‌లోనే ప్రభుత్వ బలగాల కాల్పుల్లో 200 మంది మరణించారని ఓ వైద్యుడు సోషల్‌మీడియాలో వెల్లడించారు. నిరసనల్లో పాల్గొనేవారిని దైవానికి శత్రువుగా భావించి మరణశిక్ష విధిస్తామని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెదీ ఆజాద్ హెచ్చరించారు.
Also Read:
పసిడి ప్రియులకు షాక్.. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
కుక్క ఎంత పని చేసింది.. నడి రోడ్డుపై రచ్చ రచ్చ..