డాలర్ వాడకాన్ని తగ్గించాలని ఇరాన్ సుప్రీం లీడర్ పిలుపు
ABN , Publish Date - Aug 30 , 2026 | 04:53 PM
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ దేశ ఆర్థిక విధివిధానాలపై కీలక ప్రకటన చేశారు.
టెహ్రాన్, ఆగస్టు 30: ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మోజ్తబా ఖమేనీ దేశ ఆర్థిక విధివిధానాలపై కీలక ప్రకటన చేశారు. బాహ్య ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకుని దీర్ఘకాలిక స్థిరత్వాన్ని సాధించడానికి స్వదేశీ ఉత్పత్తిని పెంచడం, 'రెసిస్టెన్స్ ఎకానమీ'ని కేంద్ర బిందువుగా మార్చడం అత్యంత ఆవశ్యకమని ఆయన స్పష్టం చేశారు.
ఇరాన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక సవాళ్లకు స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడమే సరైన పరిష్కారమని ఖమేనీ పేర్కొన్నారు. ఒకవేళ స్వదేశీ ఉత్పత్తి చాలకపోతే, దిగుమతులను ఎంతో తెలివిగా, సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యావసర ధరల నియంత్రణ వంటి సమస్యలను తీవ్రంగా పరిగణించాలని, పెట్టుబడులను పెంచి వాటిని అవసరమైన ఉపయోగకర రంగాల వైపు మళ్లించాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ లావాదేవీల్లో ప్రాధాన్యత కలిగి ఉన్న అమెరికా డాలర్ పాత్రను దశలవారీగా తొలగించాలని ఇరాన్ సుప్రీం లీడర్ పునరుద్ఘాటించారు. తమ దేశ పురోగతికి శత్రు దేశాల లొంగుబాటు షరతులు పరిష్కారం కావని, సొంత శక్తిపై ఆధారపడటమే నిజమైన అభివృద్ధికి మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడిని తీవ్రతరం చేసేందుకు అమెరికా 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్' పేరిట కఠిన చర్యలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇరాన్ బ్యాంక్ మెల్లికి చెందిన దుబాయ్ బ్రాంచ్ మేనేజర్‌తో పాటు ఇరాన్ ఆర్థిక కార్యకలాపాలకు సహకరిస్తున్న హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే ఒక సంస్థపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ పాలనకు లభించే అంతర్జాతీయ నిధుల మార్గాలను అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా వెల్లడించింది.
భిన్నత్వంలో ఏకత్వం ఇండియా డీఎన్ఏలోనే ఉంది: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
దేశానికి డ్రగ్స్ పీడ వదిలిపోవాలి.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని