ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహ్రదాద్ అఖ్లాఘీ.. పార్లమెంట్ ఆమోదం
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:17 PM
ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా మెహ్రదాద్ అఖ్లాఘీ ఎంపికయ్యారు. పార్లమెంట్లో జరిగిన విశ్వాస పరీక్షలో ఆయనకు అనుకూలంగా 237 ఓట్లు వచ్చాయి. గతంలో ఇరాన్ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అఖ్లాఘీ కీలక బాధ్యతలు నిర్వహించారు.
Iran New Defence Minister: ఇరాన్ మాజీ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే (Aziz Nasirzadeh) అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన దాదాపు 8 నెలల తర్వాత, ఆ దేశ పార్లమెంట్ (ఇస్లామిక్ కన్సల్టేటివ్ అసెంబ్లీ) నూతన రక్షణ మంత్రిగా మెహ్రదాద్ అఖ్లాఘీ (Mehrdad Akhlaghi)అభ్యర్థిత్వానికి అధికారికంగా ఆమోదం తెలిపింది. ఇవాళ (ఆదివారం) జరిగిన పార్లమెంట్ సమావేశంలో రక్షణ, సాయుధ దళాల లాజిస్టిక్స్ మంత్రిగా ఆయనకు ఎంపీలు విశ్వాస ఓటు ప్రకటించారు.
భారీ మెజార్టీతో గెలుపు
మొత్తం పోలైన 277 ఓట్లలో మెహ్రదాద్ అఖ్లాఘీకి అనుకూలంగా 237 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ఇరాన్ నూతన రక్షణ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మొదటి విడత దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఇతర సీనియర్ మిలిటరీ కమాండర్లతో పాటు అప్పటి రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే మరణించారు. ఆ ఘటన తర్వాత సుదీర్ఘ కాలం ఖాళీగా ఉన్న ఈ అత్యంత కీలకమైన పదవికి ఇప్పుడు అఖ్లాఘీ ఎంపికయ్యారు.
అఖ్లాఘీకి ఎలాంటి ప్రత్యక్ష సైనిక హోదా లేకపోయినప్పటికీ, ఆయన ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖలో 42 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. 2013 నుంచి ఇరాన్ ఆయుధాల తయారీ సంస్థ అయిన 'ఇరానియన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఆర్గనైజేషన్' అధిపతిగా వ్యవహరిస్తున్నారు.
ఐక్యరాజ్యసమితి ఆంక్షలు
న్యూక్లియర్, బాలిస్టిక్ మిస్సైల్ తయారీ కార్యకలాపాల్లో భాగస్వామ్యం ఉందనే ఆరోపణలతో 2007లోనే ఐక్యరాజ్యసమితి (UN) అఖ్లాఘీపై ఆంక్షలు విధించింది. కాగా, ఓటింగ్ ముందు అఖ్లాఘీ మాట్లాడుతూ.. 'ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించడం అత్యంత సున్నితమైన అంశం. దేశ రక్షణకు ప్రస్తుత పరిణామాల వెనుక ఉన్న లాజిక్ను అర్థం చేసుకోవడం, భవిష్యత్తు సవాళ్లకు అనుగుణంగా సిద్ధంగా ఉండటం ఎంతో అవసరం' అని స్పష్టం చేశారు.
కాల్పుల విరమణ ప్రయత్నాలు, యుద్ధ పరిణామాలు ఊపందుకుంటున్న వేళ ఇరాన్ క్షిపణి, సైనిక సాంకేతిక పరిజ్ఞానంలో అనుభవజ్ఞుడైన అఖ్లాఘీని రక్షణ మంత్రిగా ఎన్నుకోవడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
అలా అనుండాల్సింది కాదు.. ‘నిర్బంధ సేవకుల’ కామెంట్స్పై వాన్స్ వివరణ
అగ్నికీలల్లో ఫ్రాన్స్.. భయానక దృశ్యాలు.. వీధుల్లో 5 లక్షల మంది నిరసనలు