సౌదీలోని అతిపెద్ద రిఫైనరీపై ఇరాన్ దాడి.. వీడియో వైరల్
ABN , Publish Date - Mar 02 , 2026 | 04:14 PM
అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కో రిఫైనరీ కంపెనీపై డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఇప్పటికే అనేక భవనాలు, కీలక స్థావరాలు నేలమట్టం అయ్యాయి. అయితే తాజాగా సౌదీ అరేబియాలోని అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్‌కో (Saudi Aramco) రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసినట్లు తెలుస్తోంది. రాస్ తనురాలోని ఈ రిఫైనరీపై షాహెద్-136 డ్రోన్‌తో దాడి (Iran Drone Attack) చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ దాడి ప్రభావం చమురు ధరలపై ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయమీడియా కథనం ప్రకారం.. ఇవాళ(సోమవారం) ఇరాన్ అరామ్ కో రిఫైరనరీపై దాడి చేసింది. ఈ దాడి కారణంగా చమురుశుద్ధి కేంద్రం వద్ద భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన నేపథ్యంలో రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని సమాచారం. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగిన తరువాత చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ యుద్ధం కారణంగా వివిధ దేశాలకు ఇంధన కొరత ఏర్పడనుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా చమురు ధరలు మండుతున్నాయి. చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz)లో నౌకల రవాణాను ఇరాన్ అడ్డుకోవడంతో ధరలు 10 శాతం మేర పెరిగాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడి చమురు ధర 80 డాలర్లు దాటింది. ఇప్పుడు తాజా దాడులతో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంధన ధరలు పెరుగుదల అనేది సామాన్యులు వినియోగించే కిరాణా సామాగ్రి, ఇతర వస్తువుల ధరలపై ప్రభావం చూపనుంది. చాలా మంది వినియోగదారులు ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నారు. మరోవైపు, పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. కువైట్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ దాడి జరగ్గా.. దుబాయ్, దోహా, అబుదాబి, జెరూసలెంలోనూ సోమవారం పేలుడు శబ్దాలు వినిపించాయి.
ఇవి కూడా చదవండి..
అమెరికాకు బిగ్ షాక్.. కుప్పకూలిన యుద్ధ విమానం.. వీడియో వైరల్
ఇరాన్‌పై దాడులు! అమెరికన్ల అభిప్రాయం ఏంటంటే..