ఇండోనేషియాలో 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా నిషేధం!
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:22 PM
నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై తీవ్రంగా ఉంటోంది. సోషల్ మీడియా వ్యసనం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనల నుంచి పిల్లలను రక్షించడమే ప్రధాన లక్ష్యంగా ఇండోనేషియా ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం పిల్లల(childrens)పై తీవ్రంగా ఉంటోంది. ఇండోనేషియా(Indonesia) ప్రభుత్వం ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా పూర్తిస్థాయిలో నిషేధాన్ని విధిస్తూ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ రోజు(శుక్రవారం) ఇండోనేషియా సమాచార, డిజిటల్ మంత్రిత్వ శాఖ ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. మార్చి 28 నుంచి కొత్త నిబంధనలు అధికారికంగా అమలులోకి వస్తాయి. సోషల్ మీడియా సంస్థలు తమ వినియోగదారుల వయస్సును కచ్చితంగా ధృవీకరించే సాంకేతికతను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇకపై ఫేస్ బుక్, టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్, రోబ్లాక్స్, యూట్యూబ్ వంటి యాప్‌లలో 16 ఏళ్ల లోపు వారు ఖాతాలు తెరవడం పూర్తిగా నిషేధం. ఈ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీలపై భారీ జరిమానాలు లేదా సేవలను నిలిపి వేయాల్సి వస్తుందని హెచ్చరించింది. సైబర్ బుల్లింగ్, ఆన్‌లైన్ మోసాలు, అశ్లీలత, సోషల్ మీడియా వ్యసనం వల్ల కలిగే ఒత్తిడి, ఆందోళనల నుంచి పిల్లలను రక్షించడమే ప్రధాన లక్ష్యం అని ఆ దేశ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆసియాలో అతిపెద్ద ఇంటర్నెట్ వినియోగదారుల మార్కెట్ కలిగిన ఇండోనేషియా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. భారత్‌లో కూడా ఒక్కో రాష్ట్రంలో ఈ నిషేధాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీ సాక్షిగా శుక్రవారం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించబోతున్నట్లు ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం అసెంబ్లీలో ఈ ప్రస్తావన తీసుకువచ్చారు..13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరంగా ఉంచాలనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
హృదయపూర్వక అభినందనలు చిట్టితల్లులు: మంత్రి లోకేశ్
ప్రతిపక్షం తన బాధ్యతను పూర్తిగా విస్మరించింది: మంత్రి పయ్యావుల కేశవ్
Read Latest AP News And Telugu News