అమెరికాలో భార్యను చంపి.. ఫొటోను ఇండియాలో ప్రియురాలికి షేర్ చేసి..
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:03 AM
అమెరికాలో ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహం ఫొటోను ఇండియాలో ఉన్న తన ప్రియురాలికి పంపినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మృతదేహం ఫొటోను ఇండియాలో ఉన్న తన ప్రియురాలికి పంపిన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. అమెరికాలోని బెల్లేవులో నివాసముంటున్న 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్ అవినాష్ నార్నే, గతేడాది అక్టోబర్ 27న తన భార్య రాజిత సబ్బినేని (27) బాత్‌రూమ్‌లో లాక్ చేసుకుని బయటకు రావడం లేదంటూ పోలీసులకు ఫోన్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి చూడగా రాజిత కింద పడిపోయి ఉంది. ఆమె అప్పటికే మరణించినట్లు అధికారులు నిర్ధారించారు. తాను బయటకు వెళ్లి 40 నిమిషాల తర్వాత వచ్చేసరికి భార్య లోపల లాక్ చేసుకుందని అవినాష్ పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే, అతను బయటకు వెళ్లిన సమయంలో వేరే ఎవరూ ఇంట్లోకి రాలేదని నిఘా కెమెరాల ద్వారా స్పష్టమైంది. ఆ మరుసటి రోజే కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ ఆఫీస్ నివేదికలో రాజితది గొంతు నులిమి చేసిన హత్యేనని తేలింది.
పోలీసుల దర్యాప్తులో అవినాష్‌కు సంబంధించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అవినాష్‌కు భారతదేశంలో ఒక మహిళతో చాలా ఏళ్లుగా సంబంధం ఉంది. ఆ బంధం కొనసాగుతుండగానే.. 2025 జూన్ 5న రాజితను వివాహం చేసుకున్నాడు. అవినాష్ ప్రియురాలు కూడా ఈ పెళ్లికి హాజరైంది. పెళ్లి తర్వాత కూడా వీరిద్దరూ తమ అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. హత్య జరిగిన రోజున అవినాష్ తన ప్రియురాలికి కనీసం నాలుగు సార్లు ఫోన్ చేసినట్లు తెలిసింది. తన భార్య బాత్‌రూమ్‌లో చిక్కుకుపోయిందని పోలీసులకు అబద్ధం చెప్పిన సమయంలోనే, అతను తన భార్య మృతదేహానికి సంబంధించిన ఫొటోను ఇండియాలోని ప్రియురాలికి పంపినట్లు అధికారులు గుర్తించారు.
విచారణలో భాగంగా రాజిత మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన అధికారులకు కీలకమైన మెసేజ్‌లు లభించాయి. అవినాష్ తనకు ఇచ్చే డ్రింక్స్ ఎప్పుడూ చేదుగా ఉంటున్నాయని రాజిత పలుమార్లు అతనికి మెసేజ్ చేసింది. ఆమె మరణించిన రోజున కూడా అవినాష్ తయారు చేసి ఇచ్చిన స్మూతీ మందు, దగ్గు సిరప్ లాగా రుచిగా ఉందంటూ మెసేజ్ పంపింది. దీన్ని బట్టి ఆమెపై ముందే విషప్రయోగం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సుదీర్ఘ విచారణ అనంతరం జులై 5న అవినాష్‌పై ఫస్ట్-డిగ్రీ మర్డర్ కేసు నమోదు చేశారు. ఈ నేరానికి అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అతను 5 మిలియన్ డాలర్ల బెయిల్ బాండ్‌పై జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి..
లోకో పైలట్ సమోసాల కొనుగోలు వీడియోపై స్పందించిన రైల్వే శాఖ
సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రైల్వేట్రాక్‌పై ప్రయాణికుల నడక.. వీడియో వైరల్
For More Viral News And Telugu News