Share News

300 మందికిపైగా భారతీయుల గల్లంతు

ABN , Publish Date - Aug 28 , 2026 | 04:58 AM

నేపాల్‌ జల విలయంతో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వరదల్లో 300 మందికిపైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో.. ఎక్కడెక్కడ ఎంత మంది చిక్కుకున్నారు, వరదల్లో గల్లంతైనవారు ఎంత మంది అన్న వివరాలపై పూర్తి స్పష్టత రావడం లేదు.

300 మందికిపైగా భారతీయుల గల్లంతు
neapal

  • చాలా మంది మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినవారే..

  • నేపాల్‌లో చిక్కుకున్న వందలాది మంది

  • టిబెట్‌లో మరో 200 మంది

  • జాడ తెలియని హైదరాబాద్‌ మహిళ!

  • 23 మంది తెలంగాణవాసుల ఆచూకీ గల్లంతు: మంత్రి పొంగులేటి

  • ఏపీకి చెందిన ఏడుగురు కూడా..

  • ఎక్కడ చూసినా బురద.. కొండరాళ్లు

  • నేపాల్‌లో 392కు చేరిన మృతులు

  • 1500 మంది గల్లంతు

  • 52 హెలికాప్టర్లతో సహాయక చర్యలు

  • 466 మందిని కాపాడిన బలగాలు

  • ఆస్పత్రులు, మార్చురీల్లో తమవారి కోసం వెతుక్కుంటున్న బాధితులు

  • భారతీయులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టామన్న విదేశాంగ శాఖ

  • ఈశా ఫౌండేషన్‌ బృందం ఆచూకీ తెలియకపోవడంపై జగ్గీ వాసుదేవ్‌ కన్నీళ్లు

  • త్రిశూలి ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా..

    న్యూఢిల్లీ, ఆగస్టు 27: నేపాల్‌ జల విలయంతో వందలాది మంది భారతీయులు చిక్కుకుపోయారు. వరదల్లో 300 మందికిపైగా గల్లంతయ్యారు. వరదల కారణంగా రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో.. ఎక్కడెక్కడ ఎంత మంది చిక్కుకున్నారు, వరదల్లో గల్లంతైనవారు ఎంత మంది అన్న వివరాలపై పూర్తి స్పష్టత రావడం లేదు. గురువారం సాయంత్రం వరకు అందిన గణాంకాల మేరకు 300 మందికిపైగా భారతీయులు గల్లంతయ్యారని, ఇంకా వందలాది మంది చిక్కుకుపోయారని విదేశాంగ శాఖ వెల్లడించింది. అందులో భారత్‌ నుంచి మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన పర్యాటకులతోపాటు, అక్కడి త్రిశూలి జలవిద్యుత్‌ కేంద్రం పనిచేస్తున్న 73 మంది భారతీయ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపింది. ఇటు నేపాల్‌లో, అటు టిబెట్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు నేపాల్‌ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ వెల్లడించారు. టిబెట్‌లో 200 మందికిపైగా భారతీయులు చిక్కుకుపోయారని.. వారు తిరిగి రావాల్సిన మార్గం వరదల్లో దెబ్బతినడంతో వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వరద సహాయక చర్యల కోసం నేపాల్‌కు అన్నిరకాల సహాయం అందిస్తున్నామని, ఇప్పటికే రెండు విమానాల్లో సహాయక సామగ్రిని పంపామని వెల్లడించారు.


మానస సరోవర్‌ యాత్రికులే ఎక్కువ

నేపాల్‌ జల విలయం నేపథ్యంలో.. ఎంత మంది ఆ దేశ పర్యటనకు వెళ్లారు, ఎక్కడెక్కడ ఉన్నారు, వరదల సమయంలో ప్రభావిత ప్రాంతాల్లో ఎంత మంది ఉన్నారనే వివరాలపై రాష్ట్రాలు వివరాలు సేకరిస్తున్నాయి. అందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేసి, ప్రజల నుంచి అందిన వివరాలను ప్రకటిస్తున్నాయి. తమిళనాడు నుంచి మానస సరోవర్‌ యాత్రకు వెళ్లినవారిలో 20 మంది సురక్షితంగా ఉన్నారని, మరో బృందంలోని 37 మంది, చెన్నై నుంచి ఇంకో బృందంలో వెళ్లిన 49 మంది ఆచూకీ తెలియడం లేదని తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. ఇక మహారాష్ట్ర నుంచి 57 మందితో కూడిన ఒక బృందం, మరో 25 మంది వరకు విడివిడిగా మానస సరోవర్‌ యాత్రకు వెళ్లారని, వారి ఆచూకీ ఇంకా లభించలేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. తమ రాష్ట్రానికి చెందిన 53 మంది నేపాల్‌లో చిక్కుకుపోయారని కేరళ ప్రకటించింది. ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన 32 మంది బృందం, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 61 మంది జాడ తెలియడం లేదని విదేశాంగ శాఖ తెలిపింది.


ఈ వార్తలనూ చదవండి:

మరో ఘోరం

ప్రళయ నేపాలం
Read Latest 
AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 07:10 AM