మరో ఘోరం
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:40 AM
హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న ప్రైవేటు బస్సు ప్రమాద సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే మరో ఘోరం జరిగింది. పల్నాడు జిల్లాలో ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు మరణించారు.
పల్నాడులో ఆటోను ఢీకొట్టిన బస్సు.. ఏడుగురు మృతి
పుట్టిన రోజు వేడుకలకు ఆటోలో వెళ్లి వస్తున్న
ఒకే గ్రామానికి చెందిన 15 మంది
చిలకలూరిపేటలో ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
మృతుల్లో ఆరుగురు మహిళలు..
నలుగురు చిన్నారులు సహా 8 మందికి గాయాలు
బాధితులంతా ఒకే గ్రామానికి చెందిన బంధువులు
హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న ప్రైవేటు బస్సు ప్రమాద సంఘటన జరిగి 24 గంటలు గడవక ముందే మరో ఘోరం జరిగింది. పల్నాడు జిల్లాలో ఆటోను ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన ఘటనలో ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. ఓ వృద్ధురాలు, ఆమె కోడలు, కుమార్తె, భార్యాభర్తలు, వరుసకు అత్తా కోడళ్లూ మరణించారు. నలుగురు చిన్నారులు సహా ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా సమీప బంధువులే. ఇక... అనంతపురం జిల్లాలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన మరో ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు, వ్యాపారి అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
చిలకలూరిపేట/బెళుగుప్ప, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): వారందరిదీ ఒకే గ్రామం.. అంతా బంధువులు. చిన్నారి పుట్టినరోజు వేడుకకు వెళ్లారు. రోజంతా సంతోషంగా గడిపారు. ఆనందంగా పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. ఆ తర్వాత ఆటోలో స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. కాసేపట్లో గ్రామానికి చేరుకోవాల్సిన సమయంలో ఊహించని ఘోరం జరిగింది. ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన చవుటుపల్లి లక్షమ్మ చెల్లెలు పలకలూరు సుబ్బులమ్మ ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలం కొండ మంజులూరులో ఉంటోంది. సుబ్బులమ్మ మనవడు మరియబాబు కుమార్తె నక్షత్ర తొలి పుట్టినరోజు వేడుకలు బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ వేడుకకు వేలూరు నుంచి బంధువులు 15మంది ఆటోలో వెళ్లారు. రాత్రి పొద్దుపోయే వరకు వేడుకలో పాల్గొన్నారు. విందు భోజనాలు చేసి తిరుగు ప్రయాణమయ్యారు. చిలకలూరిపేటకు చేరుకుని.. పురుషోత్తమపట్నం అడ్డరోడ్డు సెంటర్ నుంచి వేలూరు వెళ్లేందుకు ఆటో మలుపు తిరుగుతుండగా విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న వరుణ్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. బస్సు బలంగా ఢీకొట్టడంతో ఆటోలోనివారు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో చవుటుపల్లి లక్ష్మమ్మ(75), ఆమె కోడలు సువార్త(45), కుమార్తె బొంతా గంగమ్మ(50), భార్యాభర్తలు బొంత బాబురావు(62), మణెమ్మ (55), వరుసకు అత్తా కోడళ్లు బొంత సంపూర్ణమ్మ (70), బొంత మరియమ్మ(50) ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు బొంత పల్లవి, తాళ్లూరి అభిరామ్, బొంత శ్యామేల్‌రాజు, బొంత దివ్య.. మరో నలుగురు చవుటుపల్లి ధనమ్మ, చవుటుపల్లి సబ్బులమ్మ, వెంకాయమ్మ, ఆటో డ్రైవర్ బొంత ఆరుణ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చిలకలూరిపేట, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్వగ్రామంలో శోకం..
ఒకే గ్రామానికి చెందిన ఏడుగురు చనిపోవడంతో వేలూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులందరూ వ్యవసాయ కూలీలు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు.. చిలకలూరిపేట ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించారు. ప్రైవేట్ ట్రావెల్స్‌తో మాట్లాడి తగిన పరిహారం అందించేలా చూడాలని అధికారులను పుల్లారావు కోరారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, ప్రభుత్వం తరఫున తగిన న్యాయం జరిగేలా చూస్తానని ఎంపీ లావు హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ బాధిత కుటుంబ సభ్యులను, అధికారులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బస్సు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద ఘటనపై చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
నిర్లక్ష్యం బలి తీసుకుంది!
ఆటో, బస్సు డ్రైవర్లు కొంచెం జాగ్రత్త వహించినా ప్రమాదం జరిగి ఉండేది కాదని తెలుస్తోంది. అడ్డరోడ్డులో ఆటో మలుపు తిరిగే సమయంలో బస్సు ఆటోను ఢీకొట్టింది. డ్రైవర్లిద్దరూ అప్రమత్తంగా వ్యవహరించి ఉంటే ప్రమాదం జరిగేది కాదని తెలుస్తోంది. అతివేగంతో దూసుకెళ్లే ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
చంద్రబాబు, పవన్ దిగ్భ్రాంతి
అమరావతి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): చిలకలూరిపేట ఘోర రోడ్డుప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాద ఘటనపై పవన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చిలకలూరిపేట దుర్ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వార్తలను కూడా చదవండి
మంత్రి లోకేష్ పర్యటనకు భారీ ఏర్పాట్లు