తాగునీటికి మాత్రమే...
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:25 AM
జిల్లావ్యాప్తంగా నెలకొన్న తాగునీటి ఇక్కట్ల నుంచి కొంతమేర ఉపశమనం లభించనుంది. సాగర్ డ్యామ్ నుంచి తాగునీటి అవసరాల కోసం బుధవారం జలాలను విడుదల చేశారు.
ఐదు జిల్లాల అవసరాలకు 8 టీఎంసీలు
తొలుత బుగ్గవాగు, అనంతరం దిగువకు
నెలాఖరుకు జిల్లాకు చే రే అవకాశం
ఉమ్మడి జిల్లాలో తీవ్రంగా ఉన్న తాగునీటి ఇక్కట్ల నుంచి ఉపశమనం
ఒంగోలు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా నెలకొన్న తాగునీటి ఇక్కట్ల నుంచి కొంతమేర ఉపశమనం లభించనుంది. సాగర్ డ్యామ్ నుంచి తాగునీటి అవసరాల కోసం బుధవారం జలాలను విడుదల చేశారు. సాగర్ కుడికాలువ పరిధిలో ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు జిల్లాలు ఉండగా ఆయా జిల్లాల్లో తాగునీటి కోసం కనీసం 8 టీఎంసీలు అవసరమని రాష్ట్ర అధికారులు మంగళ వారం జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశంలో నివేదించారు. ఈ సీజన్ నీటి పంపకాలపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్పష్టత రాకపోవడంతో వచ్చేనెల 4న మరోసారి భేటీ కావాలని కేఆర్‌ఎంబీ నిర్ణయించింది.
సమస్య తీవ్రత దృష్ట్యా..
రాష్ట్రంలో సాగర్ కుడి కాలువ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో అత్యవసర సమా వేశంలో డ్యామ్ నుంచి నీటిని తీసుకొని అనంతరం కేఆర్‌ఎంబీ నుంచి ఆమోదం పొందే అధికారం రాష్ట్రానికి ఉంది. ఆ నిబంధనకు అనుగుణంగా బుధవారం డ్యామ్ నుంచి కుడి కాలువకు నీటిని అధికారులు విడుదల చేశారు. కేవలం తాగునీటి కోసం మాత్రమే ఇవ్వనున్నారు. సాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 536.90 అడుగుల నీటిమట్టం, 180.90 టీఎంసీల నీరు ఉంది. ఎగువ నుంచి కేవలం 2,150 క్యూసెక్కులు మాత్రమే నీరు డ్యామ్‌లోకి వస్తుండగా ఇక్కడికి నీరు వచ్చే శ్రీశైలం డ్యామ్ కూడా ఇంకా నిండలేదు.
2వేల క్యూసెక్కులు విడుదల
ఎల్‌నినో దెబ్బతో వర్షాలు లేక ఇతర ప్రాంతాల నుంచి నీరు రావడం లేదు. ఈనేపథ్యంలో ఈ ఏడాది సాగర్ డ్యామ్ నుంచి వరిసాగు, ఇతర పంటలకు నీటిని ఇచ్చే అవకాశం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో తాగునీటి కోసం బుధవారం జలాలను విడుదల చేశారు. ఉదయం పది గంటల సమయంలో డ్యామ్ నుంచి కుడికాలువకు తొలుత 2వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేయగా క్రమంగా రాత్రికి 6వేల క్యూసెక్కులకు పెంచారు. అలా పక్షం రోజులపాటు కుడికాలువకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీరు వస్తుంది. కాగా కుడికాలువ పరిధిలో మొత్తం 442 చెరువులు, మరో 16 మునిసిపాలిటీలకు తాగునీటిని అందించే ఎస్‌ఎస్ ట్యాంకులు ఉన్నాయి. అందులో ఒంగోలు ఎన్‌ఎస్పీ సర్కిల్ పర్యవేక్షణలో ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 222 తాగునీటి చెరువులు, ఒంగోలుతో సహా ఐదు మునిసిపాలిటీలు ఉన్నాయి.
తాగునీటి వనరులకే ప్రాధాన్యం
ప్రస్తుతం ప్రకాశంలో 145, బాపట్ల జిల్లా ప్రాంతంలో 63, మార్కాపురం జిల్లాలో 14 చెరువులు ఉన్నాయి. మరో 200 వరకు నాన్ నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి. వీటన్నింటికి ప్రస్తుతం విడుదల చేసిన నీటిని నింపేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు. కాగా డ్యామ్ నుంచి వదిలిన నీటితో కుడి ప్రధాన కాలువ ఎగువ భాగాన ఉన్న బుగ్గవాగు రిజర్వాయర్‌ను తొలుత నింపి అనంతరం దిగువకు ఇస్తారు. అలా నెలాఖరు నాటికి ఉమ్మడి జిల్లా సరిహద్దు ప్రాంతానికి నీరు వచ్చే అవకాశం ఉంది. అనంతరం ఉమ్మడి జిల్లాలో చెరువులు, ఎస్‌ఎస్ ట్యాంకులు నింపాల్సి ఉంటుంది. తొలుత ఒంగోలు కోసం రామతీర్థం రిజర్వాయర్‌ను నింపి అనంతరం ఇతర ఎస్‌ఎస్ ట్యాంకులు, చెరువులను నింపనున్నారు. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి విడుదల కావడంతో యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.