Share News

ఏం తినాలి ఎలా బతకాలి ?

ABN , Publish Date - Aug 28 , 2026 | 12:38 AM

నిత్యావసర వస్తువులు కొండెక్కి కూర్చున్నాయి. పప్పులు, వంటనూనెలు, బియ్యంతో పాటు ఇతర వంటింటి సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల వంటింట్లో ధరల మంట రాజుకుంటోంది.

ఏం తినాలి ఎలా బతకాలి ?

భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు

ఏడాదిలో 50 శాతం పెరుగుదల

బియ్యం, పప్పులు ధరలు పైపైకి

సలసలమంటున్న వంటనూనెలు

కూరగాయల ధరలకూ రెక్కలు

ఆంధ్ర అన్నపూర్ణ జిల్లాలో కరువు పరిస్థితి

నిత్యావసర వస్తువులు కొండెక్కి కూర్చున్నాయి. పప్పులు, వంటనూనెలు, బియ్యంతో పాటు ఇతర వంటింటి సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల వంటింట్లో ధరల మంట రాజుకుంటోంది. కారణాలేమైనా సామాన్యులు బతికే పరిస్థితి కనిపించడం లేదు.. ఏం తినాలి.. ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పాలకొల్లు/జంగారెడ్డిగూడెం రూరల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర వస్తువుల ధర లకు రెక్కలు వచ్చాయి. ఆంధ్ర అన్నపూర్ణగా వెలుగు వెలిగిన పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలో బియ్యం ధరలు ఎగబాకాయి. ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరి, మరోవైపు ధరల స్థిరీకరణ మండలి నిర్లక్ష్య ధోరణితో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దశా బ్దకాలంతో పోలిస్తే ఆగస్టు నాటికి నిత్యా వసరాల ధరలు 50 నుంచి 110 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఉల్లి ధర 110 శాతం పెరగ్గా, వంటనూనెల ధరలు 100 శాతం, వివిధ పప్పుల ధరలు సగటున 80 శాతం పెరి గాయి. అంటే సరాసరి పదేళ్లకాలంలో 100 శాతం ధరలు పెరిగాయి. ఇటీవల ధరలు అనూ హ్యంగా పెరుగుతూ వచ్చాయి. గత ఫిబ్రవరి మాసాంతం నుంచి ఆగస్టు ఆరంభం నాటికి 16 రకాల కీలక ఆహారపదార్థాల రేట్లు అనూహ్యంగా పెరిగాయి. కందిపప్పు కిలోకు రూ.6 పెరగ్గా, మినపప్పు కిలోకు రూ.5, శనగపప్పు రూ.5, వంట నూనెలు లీటరుకు రూ.8 నుంచి 10 వరకూ పెరిగాయి. ధరలు పెరగడానికి కారణం వంటనూనెలకు అంత ర్జాతీయ పరిస్థితులు తోడయ్యాయి. అమెరికా, ఇజ్రాయిల్‌ – ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో హార్మోజ్‌ జలసంధి మూతబడటంతో వంటనూనెల ధరలు పెరిగాయి. డీజిల్‌, పెట్రోలు ధరలు పెరగడంతో ట్రాన్స్‌పోర్టు వ్యయం పెరిగి కిలోకు 50 పైసలు నుంచి రూపాయి వరకూ ధరలు పెరుగుతూ వచ్చాయి.

ఎల్‌నినో ప్రభావం

బలహీన రుతుపవనాలు, ఎల్‌నినో తీవ్ర ప్రభావం కారణంగా వర్షాలు లేక పంట విస్తీర్ణం తగ్గింది. జిల్లా పరిస్థితి చూస్తే 54 శాతం వర్షపాతం తగ్గుదల కనిపి స్తోంది. 32 శాతం తక్కువ వర్షపాతం ఉండగా, తక్కువ వర్షపాతం నమోదైన జిల్లాల్లో మన జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలో గత జూలై, ఆగస్టు నెలల్లో వర్షపాతం ఎక్కువ ఉండి కూరగాయల పంటలు దెబ్బతినగా, ఇప్పుడు వర్షాలు లేక కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. జిల్లాలో బియ్యం వినియోగం ఇటీవల గణ నీయంగా తగ్గినప్పటికీ ధరలు మాత్రం పెరు గుతూనే ఉన్నాయి. సన్నబియ్యం ధర రెండునెలల్లో కిలోకు రూ.10 పెరిగింది. వంటనూనెల పరిస్థితి అదేవిధంగా ఉంది. రైతు బజార్లలో సబ్సిడీపై కూర గాయలు ఇవ్వడమేకాక, మొబైల్‌ రైతుబజార్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యావసరాల ధరలపై జిఎస్‌టీ తగ్గించి నప్పటికీ ఫలితం కాన రానందున మొత్తం జీఎస్‌టీ తొలగించాలని వినియోగదారులు కోరుతున్నారు.

ఎరువుల సంక్షోభం

గల్ఫ్‌ యుద్ధం ప్రభావంతో ఎరువుల ధరలు కూడా 30 శాతం మించిపోయింది. ప్రధాన ఎరువు యూరియా ధర టన్నుకు 510 డాలర్ల నుంచి 950 డాలర్లకు ఎగ బాకింది. ఈ ప్రభావాలతో వచ్చే త్రైమాసికం నాటికి ధరలు మరింత పెరుగుతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దీనికితోడు జిల్లాలో టోకు వర్తకులు ఎల్‌నినో ఉపద్రవాలను ముందుగానే అంచనావేసి పెద్దఎత్తున అపరాలను నిల్వచేసి బ్లాక్‌మార్కెట్‌కు తరలి స్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వచ్చే నవంబరు, డిసెంబరు నెలల నాటికి వాతావరణం మరింత వేడెక్కి వరితోపాటూ, పైరు పంటలు, కూరగాయలు పండే పరిస్థితి ఉండదని అంచనా వేయడంతో టోకు వర్తకులు ముందుగానే పెద్దఎత్తున ఆహార ఉత్పత్తుల నిల్వలు పెంచుకుంటూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

అక్కరకురాని ధరల స్థిరీకరణ నిధి..

కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో వినియోగ దారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 2014లో ధరల స్థిరీకరణ నిధి (ప్రైస్‌ స్టెబిలైజేషన్‌ ఫండ్‌) ఏర్పడింది. ధరల స్థిరీకరణ మండలి రోజువారీ ధరలను గమనించడం, బఫర్‌ స్టాక్‌ తయారు చేయడం, టోకున ఆహార ఉత్ప త్తులు నిల్వ చేయడం, ధరలు పెరిగి నప్పుడు ఆ నిల్వలను మార్కెట్‌లోకి వదలడం, ఈ నిధి నుంచి రాష్ర్టాలకు వడ్డీలేని అప్పు ఇవ్వడం, ధరల స్థిరీకరణ మండలి ద్వారా చర్యలు చేపడు తుండాలి. జిల్లాస్థాయిలో ఒక ధరల స్థిరీకరణ మండలి ఉన్నట్టే తెలియని పరిస్థితి ఉంది. సంబంధిత జిల్లాస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ధరల హెచ్చుతగ్గులను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే ధరలు నానాటికీ పెరుగుతూ వస్తున్నాయి. సంబం ధిత శాఖాధికారులు స్పందించి కలెక్టర్‌ నేతృత్వంలో పట్టణాల వారీగా టోకుగా ఆహార ఉత్పత్తులను నిల్వచేసే కేంద్రాలపై తనిఖీలు నిర్వహిం చాలని ప్రజలు కోరుతున్నారు. సామాన్యుల నెలసరి ఆదాయం పది శాతం పెరిగితే ధరలు యాభైశాతం పెరిగిన పరిస్థితుల్లో ఎలా బతకాలోనని చింతిస్తున్నారు.

జూ ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వాలి

ఆశా కార్యకర్తగా 20 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. నెలకు పదివేలు జీతం. గతంలో కిరాణా పట్టీకి నెలకు రూ.4 వేలు అయ్యేవి. ఇప్పుడు రూ.5 వేలు సరి పోవడం లేదు. ఇంటి అద్దె, కరెంటు బిల్లు, పిల్లల చదు వులు, ఇతర ఖర్చులు నెలకు రూ.11 వేలకు పైబడి ఖర్చు అవుతోంది. నిత్యావసర వస్తువులను రేషన్‌షాపుల ద్వారా సబ్సిడీపై ఇవ్వాలి.

చింతపల్లి లక్ష్మి, ఆశా కార్యకర్త, పాలకొల్లు

సామాన్యులకు ధరల మంట

వంటింటిలో అడుగు పెట్టాలంటేనే భయమేస్తోంది. కూరగాయల ధరలకు తోడు ఆయిల్‌, పంచదార, బెల్లంతో పాటు పప్పుదినుసుల ధరలు అమాంతం పెరిగాయి. ఇద్దరు పిల్లలతో కూడిన చిన్న కుటుంబానికి సైతం వంటకాల ఖర్చు బాగా పెరిగిపోయింది. రానున్నది పండుగలు, కార్తీకమాసం. ఇక ఆ సమయంలో ఇదే ధరలు పెరుగుతూ ఉంటే సామాన్యులు భరించలేరు.

పి.దీపికరెడ్డి, జంగారెడ్డిగూడెం, గృహిణి

Updated Date - Aug 28 , 2026 | 12:38 AM