సంబరాల సందడి
ABN , Publish Date - Aug 27 , 2026 | 03:28 AM
జిల్లా వాసుల జీవనాడి అయిన వెలిగొండ ప్రారంభానికి సిద్ధమైంది. కృష్ణమ్మ నల్లమల సాగరానికి పరవళ్లు తొక్కే రోజు సమీపిస్తోంది. ఈనేపథ్యంలో జిల్లా అంతటా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.
మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
కంభంలో ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి
రెండు చోట్లా పెద్దఎత్తున తరలివచ్చిన రైతులు
త్రిపురాంతకంలో ఎంపీ మాగుంట, ఎరిక్షన్‌బాబు పూజలు
దోర్నాలలోనూ మోటారు సైకిళ్లతో ప్రదర్శన
మార్కాపురం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లా వాసుల జీవనాడి అయిన వెలిగొండ ప్రారంభానికి సిద్ధమైంది. కృష్ణమ్మ నల్లమల సాగరానికి పరవళ్లు తొక్కే రోజు సమీపిస్తోంది. ఈనేపథ్యంలో జిల్లా అంతటా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. వరాల వెలిగొండ వారోత్సవాల్లో భాగంగా ‘వెలిగొండ అండగా.. ఉపాధి మెండుగా’ పేరుతో మార్కాపురంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహించారు. వెలిగొండ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆనందోత్సాహాల మధ్య రైతులు భారీగా బైక్ ర్యాలీ చేపట్టారు. స్థానిక అల్లూరి పోలేరమ్మ ఆలయం వద్ద నుంచి చెన్నకేశవస్వామి ఆలయం వరకు ఈ ర్యాలీ సాగింది. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో బేస్తవారపేట జంక్షన్ నుంచి కంభం వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. హైవేపై ఆనందోత్సాహాలు, కేరింతల మధ్య సాగిన ఈ ప్రదర్శనలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం చేతులమీదుగా జరిగే వెలిగొండ ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ త్రిపురాంతకంలోని బాల త్రిపురసుందరీదేవి అమ్మవారికి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వై.పాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు పూజలు చేశారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. అనంతరం దోర్నాలలో జరిగిన బైక్ ర్యాలీలో ఎంపీ మాగుంట, ఎరిక్షన్‌బాబు పాల్గొన్నారు. కొన్ని గ్రామాల్లో కూడా రైతులు స్వచ్ఛంధంగా వెలిగొండ సంబరాలు చేసుకున్నారు.