‘పీఓకే’ పాకిస్థాన్ చేజారుతోందా?
ABN , Publish Date - Aug 28 , 2026 | 03:48 AM
ఇంతకాలం తమను పాకిస్థానీయులుగా భావించుకుంటూ, భారతీయ హోదా ఎన్నటికీ అంగీకరించబోమని చెబుతూ వస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజానీకం నేడు పాకిస్థాన్ చెర నుంచి విముక్తం కావాలని ఆందోళన బాట పట్టడం ఓ గొప్ప చరిత్రాత్మక పరిణామం.
ఇంతకాలం తమను పాకిస్థానీయులుగా భావించుకుంటూ, భారతీయ హోదా ఎన్నటికీ అంగీకరించబోమని చెబుతూ వస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రజానీకం నేడు పాకిస్థాన్ చెర నుంచి విముక్తం కావాలని ఆందోళన బాట పట్టడం ఓ గొప్ప చరిత్రాత్మక పరిణామం. గత కొంతకాలంగా పీఓకేలోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. బియ్యం, గోధుమలు, నూనెలు, పప్పుధాన్యాలు వంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. అధిక ధరలు, నిరుద్యోగం తదితర సమస్యలతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 45 లక్షల మంది సతమతమవుతున్నారు.
భారత భూభాగం నుంచి ఆక్రమించుకున్న ఈ ప్రాంతాన్ని పాకిస్థాన్ ‘ఆజాద్ కశ్మీర్’గా పిలుచుకుంటోంది. ఈ ప్రాంతానికి ప్రజలు ఎన్నుకునే ప్రధానమంత్రి, అధ్యక్షుడు, శాసన వ్యవస్థ, సొంత అధికారిక జెండా మొదలైనవి ఉన్నప్పటికీ పాలనాధికారాలన్నీ పాకిస్థాన్ ప్రభువుల చేతుల్లోనే ఉంటాయి.
భారత్‌ను బూచిగా చూపిస్తూ ఇన్నాళ్లూ పాక్ పాలకులు పీఓకే ప్రజలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే పాక్ కారణంగా అనేక ఏళ్లుగా పీఓకేలో అభివృద్ధి నిలిచిపోయింది. ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఉగ్రవాద కార్యకలాపాలు ఒక్కటే అక్కడ పెరిగాయి. పీఓకేను చెప్పు చేతల్లో పెట్టుకున్న పాకిస్థాన్‌ను దారుణమైన ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. మరోవైపు భారత్‌లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ క్రమంగా పూర్వస్థితికి చేరుకుంటోంది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయి. కాశ్మీరీ పండిట్లకు స్థానిక ముస్లిం ప్రజలు సాదర ఆహ్వానం పలుకుతున్నారు. పర్యాటక రంగం గణనీయంగా కోలుకుంది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన క్రీడాకారులు దేశం తరఫున వివిధ క్రీడలలో అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో అంతర్జాతీయ సమాజానికి గొప్ప సంకేతం ఇచ్చినట్లయింది.
అంతర్జాతీయ పరిణామాలు.. ముఖ్యంగా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, తాజాగా ఇరాన్–ఇజ్రాయెల్, అమెరికాల మధ్య సాగుతున్న భీకరపోరు కారణంగా అనేక దేశాలలో వాణిజ్యం, ఎగుమతి దిగుమతులు నిలిచిపోయి అవి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అయితే, 145 కోట్ల జనాభా కలిగిన భారత్ మాత్రం కొద్దిపాటి ఒడుదుడుకులు మినహా దృఢంగా, నిబ్బరంగా నిలబడగలుగుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో, ఆహార భద్రతలో భారత్ ప్రపంచ దేశాలలో మొదటి పది స్థానాలలో ఒకటిగా నిలబడగలిగింది.
దివాళా అంచున నిలబడిన పాకిస్థాన్ గత ఏడు దశాబ్దాలకు పైగా తన నియంత్రణలో ఉంచుకున్న పీఓకేపై పట్టు కోల్పోతున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హోరెత్తుతున్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ), స్థానిక రాజకీయ పార్టీలు, సంస్థలతో ఏర్పడిన ఐక్య కార్యాచరణ సమితి వంటివి.. ప్రభుత్వ వైఫల్యాలను ముఖ్యంగా అదుపుతప్పిన ధరలు, ఆహారం, విద్యుత్ కొరతలను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నాయి.
ఆశ్చర్యం ఏమంటే, జేఏఏసీ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రజలు ‘పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదు’ అనే నినాదాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలో అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్న పాకిస్థానీ ఉన్నత వర్గాల ప్రత్యేక హక్కులను, సదుపాయాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పీఓకేలో సాగుతున్న ఆందోళనను బలప్రయోగంతో అణచివేయాలని పాక్ పాలకులు చూస్తున్నారు. అత్యంత అమానవీయంగా పాకిస్థాన్ భద్రతా దళాలు పీఓకే ప్రాంతంలో ప్రసార మాధ్యమాలను నియంత్రిస్తున్నాయి. ఇంటర్‌నెట్ సౌకర్యం లేకుండా చేశాయి. పైగా, ప్రజలకు నిత్యావసర సరుకులు, వైద్య సామగ్రిని సైతం నిలిపివేయడం అంతర్జాతీయ సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. పీఓకేలోని ప్రజలను పాకిస్థాన్ తమ సొంత పౌరులుగా భావించేటట్లయితే ఆర్థిక దిగ్బంధనాలు ఎలా విధిస్తారని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే ఇటువంటి వైఖరి కారణంగానే.. స్వతంత్ర పౌరులుగానో లేదా కశ్మీరీ పౌరులుగానో తమను గుర్తించాలని కోరుతున్నామని పీఓకేలోని మెజారిటీ ప్రజలు వాదిస్తున్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమని భారత్ మొదటి నుంచి వాదిస్తూనే ఉంది. ఈ కారణంతోనే పీఓకేను పాకిస్థాన్ చిత్రపటంలో భాగంగా చూపించదు. పైగా జమ్మూ కశ్మీర్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో కూడా రాష్ట్ర శాసనసభలో 24 అసెంబ్లీ స్థానాలను పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌కు కేటాయించారు. ఈ ప్రాంతంపై భారతదేశానికి ఉన్న చిరకాల రాజ్యాంగ హక్కును, శాసనహక్కును నొక్కి చెప్పేందుకే ఈ స్థానాలను గతంలో లాగా ఖాళీగా ఉంచి రిజర్వ్ చేశారు. అంటే ఈ ప్రాంతం భారత్ పరిపాలనలోకి వస్తే పీఓకే ప్రాంతంలో డీలిమిటేషన్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం అధికారికంగా నిర్వహిస్తుంది. అందుకు సంబంధించి చేసిన చట్టంలో పలు నిబంధనలు చేర్చారు.
పీఓకేను సైనిక చర్య ద్వారా స్వాధీనం చేసుకునే సామర్థ్యం భారతదేశానికి లేకపోలేదు. కానీ బలవంతపు విలీనం భారత్‌కు ఇష్టం లేదు. ప్రత్యక్ష సైనిక దాడికి బదులుగా దౌత్యపరమైన ప్రక్రియతోను, స్థానిక ప్రజల అభీష్టం మేరకే ఈ అంశాన్ని పరిష్కరించాలని భారత్ భావిస్తోంది. జమ్మూ కశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సామాజిక అభివృద్ధి కారణంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ చివరకు స్వచ్ఛందంగా భారత్‌లో విలీనం కోరవచ్చని ఇటీవల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. ఆక్రమిత భూభాగంలో పౌర అశాంతి కారణంగా విలీనం చేసుకుంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయన్న వాస్తవం భారత్‌కు తెలుసు. పీఓకే అంశంపై ఇప్పటికే భారత్... ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసి, న్యాయం కోసం దౌత్యపరమైన ఒత్తిడి తెస్తోంది. అలాగే దాదాపు 45 లక్షల సంఖ్యలో ఉన్న జనాభాను నిర్వహించడమనేది, వారి పూర్తి అంగీకారం లేకుండా సజావుగా జరిగే పని కాదు.
పీఓకేను వదులుకోవడం మొదటి నుంచి పాకిస్థాన్‌కు ఇష్టం లేదు. అనుకూలమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడి నుంచి తమ మిలిటెంట్లను భారత భూభాగంలోకి పంపడం వారికి తేలిక కనుక ఎట్టి పరిస్థితులలోనూ పీఓకేను వదులుకోవడానికి పాకిస్థాన్ సిద్ధంగా లేదు. ఈ కారణంగానే, ఒకవైపు పీఓకేలో తిరుగుబాటును సైనిక చర్య ద్వారా అణచివేస్తూ, మరోవైపు ఇతర ఇస్లామిక్ దేశాల మద్దతు కోరుతోంది. అంతేకాకుండా చైనా–పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పీఓకే భూభాగంతో అనుసంధానమై ఉన్నందున.. పీఓకే విషయంలో భారత్ ఏ మాత్రం తొందరపడినా చైనా జోక్యం తప్పదని పాకిస్థాన్ నమ్ముతోంది.
పీఓకేలో ప్రస్తుతం సాగుతున్న ఆందోళనలు పరాకాష్ఠకు చేరితే వాటిని నియంత్రించడం పాకిస్థాన్‌కు సాధ్యం కాదు. ప్రస్తుతం దేశ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు పీఓకే పెద్ద తలనొప్పిగా తయారైంది. అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ప్రతిష్ఠ నానాటికీ దిగజారిపోతోంది. పొరుగున తాలిబన్ల ఆధీనంలో ఉన్న అఫ్ఘానిస్థాన్‌తో కూడా పాకిస్థాన్ సఖ్యతగా లేదు. బంగ్లాదేశ్‌లోని కొత్త ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటున్నప్పటికీ పాకిస్థాన్‌కు అక్కడి మెజారిటీ ప్రజల మద్దతు లేదు. చైనా ఒక్కటే వివిధ స్వప్రయోజనాల రీత్యా పాక్‌కు ఆపన్న హస్తం అందిస్తోంది.
ఇప్పటికిప్పుడు పీఓకే భారత్‌లో విలీనం అవుతుందని భావించలేము. పీఓకేను బలవంతంగా స్వాధీనం చేసుకొనే అవకాశం కూడా లేదు. ఒకవేళ భవిష్యత్తులో పీఓకే కనుక భారత్‌లో విలీనం అయితే తప్పనిసరిగా భారత్‌కు అనేక ప్రయోజనాలు ఒనగూరుతాయి. ప్రత్యేకించి వ్యూహాత్మక, ఆర్థిక, భద్రత, ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. మధ్య ఆసియా దేశాలకు భూమార్గం సుగమం కావడం, పాకిస్థాన్ నుంచి వచ్చే చొరబాటుదార్లను నిరోధించడం సాధ్యపడతాయి. ప్రధానంగా పాక్–చైనాల ఎకనామిక్ కారిడార్ పనులు నిలిచిపోయి పాకిస్థాన్ ఆర్థికంగా, రాజకీయంగా మరింత బలహీనపడుతుంది.
ప్రస్తుతం యావత్ ప్రపంచ దృష్టి ఇరాన్–అమెరికా యుద్ధంపైనే ఉండటం వల్ల పీఓకేలో వేగంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయ సమాజం దృష్టిని పెద్దగా ఆకర్షించడం లేదు. అయితే, ఇటీవల జెనీవాలో పీఓకే మద్దతుదారులు నిర్వహించిన భారీ ప్రదర్శనతో పీఓకేలో జరుగుతున్న మానవహక్కుల హననంపై యునైటెడ్ నేషన్స్ దృష్టి సారించింది. జమ్మూ కశ్మీర్ అంశంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు ప్రస్తుతం సానుకూల పరిస్థితులను ఏర్పరిచాయి. జమ్మూ కశ్మీర్‌లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, సంపద పెరిగి స్థూల రాష్ట్ర ఉత్పత్తి పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ ప్రశాంత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడంతో సహజంగానే పీఓకే ప్రజలు జమ్మూ కశ్మీర్‌లో అంతర్భాగం కావాలని భావిస్తున్నారు. మెజారిటీ ప్రజల మద్దతు కోల్పోయిన తర్వాత పీఓకేలో పాకిస్థాన్ పట్టు ఎంతోకాలం నిలబడదు. అయితే అదెంత కాలం అన్నదే ప్రశ్న?
- సి. రామచంద్రయ్య
శాసనమండలి సభ్యులు