Share News

అతను నన్ను చాలా సార్లు కొట్టాడు: పైలట్ స్మిత్ మచ్చార్‌

ABN , Publish Date - Oct 02 , 2026 | 09:27 AM

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాక్‌పిట్ దగ్గర జరుగుతున్న దాడిని ఎవరో వ్యక్తి తన ఫోన్ కెమెరా నుంచి ఆ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

అతను నన్ను చాలా సార్లు కొట్టాడు: పైలట్ స్మిత్ మచ్చార్‌

ఇంటర్‌నెట్ డెస్క్: దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌‌లోని టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో ఇండియన్ పైలట్ స్మిత్ మచ్చార్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. కాక్‌పిట్ దగ్గర జరుగుతున్న దాడిని ఎవరో వ్యక్తి తన ఫోన్ కెమెరా నుంచి ఆ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ‘రిలాక్స్‌గా ఉండండి, అతడిని బయటకు తీసుకెళ్లండి’ అంటూ ఎవరో వ్యక్తి కాక్‌పిట్ లోపల ఉన్నవారిని అడుగుతున్నట్లు ఆ వీడియోలో వినిపించింది.


క్రూ మెంబర్‌గా ఉన్న ఓ వ్యక్తి ‘ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా?’ అని ప్రయాణికులను అడిగారు. డాక్టర్, డాక్టర్ అని పలువురు కాసేపు కేకలు పెట్టిన తర్వాత డాక్టర్ షోతా ముసయెవ్ అనే డెంటిస్ట్ ముందుకు వచ్చారు. హిబ్రూ భాషలో ఆయన ఏదో చెప్పారు. తర్వాత ఆ కెమెరా ఫుటేజీలో కాక్‌పిట్ బయట పైలట్ మచ్చార్ రక్తమోడుతూ కనిపించారు. ‘కో పైలట్ నన్ను కత్తితో పొడిచాడు. అంతేకాకుండా నన్ను చాలా సార్లు కొట్లాడు. గాయపడిన నా చేతిని కదిలించగలను కానీ మూసి ఉంచలేకపోతున్నా ’ అని మచ్చార్ చెబుతున్న ద‌ృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.


విమానంలో ప్రయాణికుల హాహాకారాలు

పైలట్ మచ్చార్‌పై దాడి జరిగిన కాసేపటికి విమానంలో ఏం జరుగుతోందో అర్థంకాక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. పైలట్ అరుపులు విని కొంతమంది ప్రయాణికులు, విమాన సిబ్బంది కాక్‌పిట్ వద్దకు చేరుకున్నారు. కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడిన మచ్చార్ పోరాడుతూనే కాక్‌పిట్ డోర్ తెరిచారు. తర్వాత ఇజ్రాయెల్‌కు చెందిన యానివ్‌ హయూన్‌ అనే ప్రయాణికుడు ధైర్యం చేసి కోపైలట్‌ను నిలువరించాడు. కాసేపు అతనితో పోరాడి తన చేతుల్లో బంధించాడు. దాంతో మిగతా ప్రయాణికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.


‘పోలీస్, పోలీస్’ అంటూ పలువురు ప్రయాణికులు కేకలు వేశారు. ‘పోలీసులు వచ్చి కోపైలట్‌ను తీసుకెళ్లే వరకు అతడిని పట్టుకుందాం. అతను టెర్రరిస్టు. అతడిని వదలకూడదు’ అని ప్రయాణికులు చెబుతున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డు అయ్యాయి. తర్వాత కోపైలట్‌ను అతని చేతులు వెనక్కి కట్టి విమానం ఫ్లోర్ మీద మోకాళ్లపై కూర్చోబెట్టారు. తర్వాత పైలట్ మచ్చార్‌ను మెడికోలు ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకెళ్లడంతో వీడియో ముగుస్తుంది. ఇజ్రాయెల్‌కు చెందిన చానెల్ 12లో ఈ వీడియో ప్రసారమైంది. కాగా.. ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు పైలట్లు తర్వాత విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి..

మచ్చార్‌ తెగువకు ప్రపంచం ఫిదా

నా వల్లే ఆ రెండు దేశాలు ఇంకా మిగిలున్నాయి: డొనాల్డ్ ట్రంప్

మరిన్ని నేషనల్, ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2026 | 10:40 AM