అసలైన ప్రపంచం
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:59 AM
ప్రపంచ పటం మారింది. ప్రపంచ దేశాల విస్తీర్ణాలను ఇక నుంచి కచ్చితంగా సూచించేలా రూపొందించిన ‘ఈక్వల్ ఎర్త్’ ప్రొజెక్షన్ మ్యాప్‌ను ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. ఈ నెల 4న జరిగిన...
దేశాల వాస్తవ పరిమాణాలతో ‘ఈక్వల్ ఎర్త్’ మ్యాప్ సిద్ధం
ఐక్యరాజ్యసమితి ఆమోదం
ధ్రువాల వద్ద సాగదీసినట్టుగా భూభాగాలు ఇక కనిపించవు
తాజా మ్యాప్‌లో ఆఫ్రికా కన్నా14 రెట్లు తగ్గిన గ్రీన్‌ల్యాండ్
కెనడా, యూరప్ దేశాలు, రష్యా పరిమాణం కూడా
(సెంట్రల్ డెస్క్)
ప్రపంచ పటం మారింది. ప్రపంచ దేశాల విస్తీర్ణాలను ఇక నుంచి కచ్చితంగా సూచించేలా రూపొందించిన ‘ఈక్వల్ ఎర్త్’ ప్రొజెక్షన్ మ్యాప్‌ను ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. ఈ నెల 4న జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఆఫ్రికా దేశమైన టోగో.. భూభాగాల సరైన పరిమాణాలతో కూడిన ప్రపంచ పటం రూపొందించాలన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి భారత్ సహా 164 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా.. అమెరికా వ్యతిరేకంగా ఓటేసింది. మరో ఆరు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌కు భారత్ మద్దతునిచ్చింది. అయితే ‘‘అన్ని అవసరాలకు ఒకే తరహా మ్యాప్ సరిపోదు. తమ అవసరాలకు అనుగుణంగా.. ఏ తరహా మ్యాప్‌ను అనుసరించాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ దేశాలు, సంస్థలు, వ్యక్తులకు ఉండాలి’’ అని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రెటరీ రఘూపూరి అన్నారు.
ఏమిటీ మెర్కేటర్ మ్యాప్..?
గోళాకారంగా ఉన్న భూమిని, సముద్రాలను.. నలు చదరపు కాగితం యథాతథంగా చూపించడం సాధ్యం కాదు. ఆకారంలోనో, పరిమాణంలోనో, దూరాల్లోనో ఏదో ఒకదానిలో తేడాలు వస్తుంటాయి. ఈ క్రమంలో సులభమైన నావిగేషన్, భూభాగాలను సులువుగా గుర్తించడానికి వీలుగా 1569లో గెరార్డస్ మెర్కేటర్ ప్రపంచ పటాన్ని రూపొందించారు. దానినే మెర్కేటర్ ప్రొజెక్షన్‌గా పిలుస్తారు. దానిలో భూమధ్యరేఖ వద్ద అన్ని ప్రాంతాల పరిమాణం యథాతథంగా ఉంటుంది. ధ్రువాలవైపు వెళ్లినకొద్దీ భూభాగాలు వాటి వాస్తవ పరిమాణం కంటే పెద్దగా సాగదీయబడుతూ ఉంటాయి. అంటే ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల కంటే.. ఉత్తరాన కెనడా, గ్రీన్‌ల్యాండ్, రష్యా, పూర్తిగా దిగువన ఆస్ట్రేలియా వంటివి పరిమాణంలో పెద్దగా కనిపిస్తుంటాయి. మెర్కేటర్ ప్రొజెక్షన్‌లో దిశలన్నీ సరిగా ఉండటం, సూటిగా చూపడం వల్ల సముద్రయానానికి, నావిగేషన్‌కు ఉపకరించింది.
సమానమైన ప్రపంచం.. ‘ఈక్వల్ ఎర్త్’!
అయితే, దేశాల పరిమాణాలను సరిగా చూపించడం లేదని మెర్కేటర్ ప్రొజెక్షన్‌పై చాలాకాలం నుంచి విమర్శలు ఉన్నాయి. యూరప్, ఉత్తర అమెరికా భూభాగాలను పెద్దగా చూపుతూ.. తమ దేశాలను కుదించారని, దాన్ని సరిచేయాలని ఆఫ్రికా దేశాల నుంచి డిమాండ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ‘ఈక్వల్ ఎర్త్’ ప్రొజెక్షన్ తెరపైకి వచ్చింది.
యూఎస్, కెనడా, రష్యా.. చిన్నవైపోతాయి!
2018లో బోజన్ షావ్రిచ్, టామ్ ప్యాటర్సన్, బెర్న్‌హార్డ్ జెన్నీ కలిసి ‘ఈక్వల్ ఎర్త్’ మ్యాప్‌ను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భూభాగాల పరిమాణాన్ని ఒకే విధంగా చూపేలా దీన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతమున్న మెర్కేటర్ మ్యాప్‌లో పైన ఉత్తర ధ్రువానికి సమీపంగా ఉన్న కెనడా, యూఎ్‌సఏ, గ్రీన్‌ల్యాండ్, చాలా యూరోపియన్ దేశాలు, రష్యా వంటివన్నీ విశాలంగా ఉంటే.. ‘ఈక్వల్ ఎర్త్’ మ్యాప్‌లో అవన్నీ చిన్నవైపోతాయి. మ్యాప్‌లో ఆఫ్రికా ఖండం పెద్దగా కనిపిస్తుంది. మ్యాప్‌లో యూఎ్‌సఏలో భాగమైన అలాస్కా, దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్ దాదాపు సమానంగా కనిపిస్తాయి. కానీ అసలైన మ్యాప్‌లో అలాస్కా ఐదింతలు చిన్నదైపోతుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మ్యాప్‌లో గ్రీన్‌ల్యాండ్ ఆఫ్రికాతో సమానంగా కనబడుతుంది. కానీ, గ్రీన్‌ల్యాండ్ కంటే ఆఫ్రికా ఏకంగా 14 రేట్లు పెద్దగా ఉంటుంది. ‘ఈక్వల్ ఎర్త్’ ప్రొజెక్షన్‌పై ఐక్యరాజ్యసమితి తీర్మానం అనగానే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు మ్యాప్‌లేమీ మారిపోవు. మెర్కేటర్ ప్రొజెక్షన్ ప్రపంచవ్యాప్తంగా నావిగేషన్‌కు అనుకూలంగా ఉండటం, దిక్కులను దాదాపు కచ్చితంగా చూపగలగడమే అందుకు కారణం. కానీ ఇకపై ‘ఈక్వల్ ఎర్త్’పై కొత్తమ్యా్‌పలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దేశాల పరిమాణాలను, విస్తీర్ణాన్ని పోల్చడం సులువు అవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
సన్నబియ్యం అమ్మితే రేషన్ కార్డు తొలగిస్తాం: మంత్రి తుమ్మల
రైతుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News