Share News

దుబాయ్ బీచ్‌లో భారతీయుల ఛఠ్ పూజ.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు..

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:03 PM

విదేశాల్లో ఉన్నా భారతీయులు తమ సాంప్రదాయాలు, పండుగలను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తాజాగా దుబాయ్‌లోని అల్ మమ్జర్ బీచ్‌లో భారతీయులు నిర్వహించిన ఛఠ్ పూజ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

దుబాయ్ బీచ్‌లో భారతీయుల ఛఠ్ పూజ.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు..
Dubai Chhath Puja

ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో ఉన్నా భారతీయులు తమ సాంప్రదాయాలు, పండుగలను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తాజాగా దుబాయ్‌లోని అల్ మమ్జర్ బీచ్‌లో భారతీయులు నిర్వహించిన ఛఠ్ పూజ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సూర్యభగవానుడికి నమస్కరిస్తూ దుబాయ్ బీచ్‌లో భక్తులు పూజలు నిర్వహించారు. సముద్రంలో పాలు, ఇతర పూజా సామగ్రి వేశారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు (Dubai Chhath Puja).


దుబాయ్‌లో నివసిస్తున్న భారతీయ ప్రవాసురాలు నేహా రాజ్ ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. వాటిలో వివిధ వయసులకు చెందిన భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి బీచ్ వద్దకు చేరుకున్నారు. వెదురు బుట్టలు, పండ్లు, పూజా సామగ్రితో మహిళలు సముద్రపు నీటిలో నిలబడి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించారు. కొందరు భక్తులు సముద్రంలో పాలు కూడా పోశారు. ఈ పూజా కార్యక్రమాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి (Dubai Indians Chhath Puja).


ఈ వీడియోలపై కొందరు స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పూలు, అరటిపండ్లు, పైనాపిళ్లు, ఇతర ఆహార పదార్థాలను సముద్రంలో వేయడం వల్ల పర్యావరణానికి హాని కలిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు నెటిజన్లు దుబాయ్ పోలీసులను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి కార్యక్రమాలకు అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. వేడుకల తర్వాత బీచ్‌ను శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని మరికొందరు వ్యాఖ్యానించారు (Chhath Puja Controversy).


ఈ వివాదంపై దుబాయ్‌కు చెందిన సుల్తాన్ అల్‌వషాహి స్పందించారు. యూఏఈ అన్ని దేశాల ప్రజలను ఆహ్వానిస్తుందని, అయితే ఇక్కడి చట్టాలు, నిబంధనలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు. భిన్న మతాలకు చెందిన ప్రజలు తమ విశ్వాసాలను పాటించవచ్చని, అయితే అందుకు అనువైన, అధికారికంగా అనుమతించిన ప్రదేశాలను మాత్రమే ఎంచుకోవాలని సూచించారు.


ఇవి కూడా చదవండి..

కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..


స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Nov 18 , 2026 | 02:07 PM