Share News

ట్రంప్‌పై అభిశంసన!

ABN , Publish Date - Nov 06 , 2026 | 04:52 AM

మధ్యంతర ఎన్నికల్లో పరాభవం ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు.. మరో సవాలు ముందుకొచ్చింది.

ట్రంప్‌పై అభిశంసన!
trump

  • అధ్యక్ష పదవి నుంచి తొలగించే తీర్మానంపై డెమోక్రాట్ల కసరత్తు

  • ట్రంప్‌, ఆయన కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలపైనా దృష్టి

  • అధికారం అండతో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు

  • హెగ్సెత్‌ను తొలగించేందుకు చర్యలు చేపడతాం: డెమొక్రాట్లు

  • అభిశంసనకు ప్రయత్నిస్తే నాశనమే!.. ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌, నవంబరు 5: మధ్యంతర ఎన్నికల్లో పరాభవం ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు.. మరో సవాలు ముందుకొచ్చింది. అమెరికా చట్టసభల్లో పూర్తి మెజారిటీ సాధించిన డెమొక్రాట్లు.. ట్రంప్‌పై అభిశంసన చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ట్రంప్‌, ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని, భారీగా లబ్ధిపొందారన్న ఆరోపణలపై సమగ్ర విచారణలకు సిద్ధమవుతున్నారు. వారి ఆర్థిక లావాదేవీలు, ప్రపంచవ్యాప్తంగా ట్రంప్‌ సంస్థలు చేపట్టిన రియల్‌ ఎస్టేట్‌, క్రిప్టో వ్యాపారాలు, ఎప్‌స్టీన్‌ కేసు వంటి అంశాలన్నీ తవ్వితీయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ కమిటీలు, సబ్‌పీనా (తమ ఎదుట హాజరై సమాధానం చెప్పాలన్న) అధికారాల సాయంతో ట్రంప్‌ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేందుకు వ్యూహం రచిస్తున్నారు. మరోవైపు తనపై అభిశంసనకు ప్రయత్నిస్తే డెమొక్రాటిక్‌ పార్టీ నాశనం అవుతుందని అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా హెచ్చరించారు. ఈ పరిణామాలతో అమెరికా రాజకీయాలు ఏ మలుపు తీసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.


చట్టసభల్లో పూర్తి మెజారిటీతో..

అమెరికా కాంగ్రెస్ లోని సెనేట్‌లోని మొత్తం 100 సీట్లకుగాను 54 సీట్లు, ప్రతినిధుల సభలోని 415 సీట్లకుగాను 240 సీట్లను డెమోక్రాట్లు దక్కించు కున్నారు. సెనేట్‌లో ఫలితాలు రావాల్సిన అలాస్కా, మిస్సిస్సిప్పిలలోనూ డెమోక్రాట్లే ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుత సభ్యుల పదవీకాలం జనవరిలో ముగుస్తుంది. కొత్తగా ఎన్నికైన వారు బాధ్యతలు చేపడతారు. అప్పుడే చట్టసభల్లో డెమొక్రాట్లకు మెజారిటీ సమకూరుతుంది. ఇరుసభలకు కొత్త స్పీకర్లను ఎన్నుకుంటారు. తమ ఎజెండాలకు అనుగుణంగా అధ్యక్షుడిపై అభిశంసన, విచారణలు వంటివి చేపడతారు. అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ఆమోదం పొందాలంటే.. ప్రతినిధుల సభలో సగానికిపైగా సభ్యులు, సెనేట్‌లో మూడింట రెండొంతుల మంది మద్దతు ఇవ్వాలి. ప్రస్తుతం డెమొక్రాట్లకు సమకూరిన బలాన్ని చూస్తే.. ప్రతినిధుల సభలో తీర్మానం సులువే. సెనేట్‌లో ఆమోదం కోసం 67 ఓట్లు అవసరం. డెమొక్రాట్లకు 54 మంది ఉన్నారు. పెండింగ్‌లోని 2 స్థానాలు ఆ పార్టీకే వస్తే బలం 56కు పెరుగుతుంది. మరో 11 మంది సభ్యుల మద్దతు కావాలి.


మెజారిటీ పొందగానే అభిశంసన

అమెరికా చట్టసభల్లో వివిధ పార్టీలకు ఉన్న సభ్యుల సంఖ్యకు అనుగుణంగా.. వివిధ అంశాలపై విచారణ అధికారులను కేటాయిస్తారు. సభా కమిటీల్లో ఎక్కువ ప్రాతినిధ్యం లభిస్తుంది. స్పీకర్‌ పదవి వస్తుంది. సబ్‌పీనా అధికారం ఉంటుంది. అంటే మంత్రులు సహా ఎవరినైనా తమ ఎదుట హాజరై, సంబంధిత అంశాల్లో వివరణ, సమాధానం ఇవ్వాల్సిందిగా ఆదేశించవచ్చు. ఇప్పుడు డెమోక్రాట్లు ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని ట్రంప్‌పై విచారణలు చేపట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ప్రతినిధుల సభలో డెమోక్రాట్ల నేతగా ఉన్న హకీమ్‌ జెఫరీస్‌ త్వరలో స్పీకర్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్రంప్‌పై అభిశంసన పెట్టే అవకాశం ఉందన్నారు. ఇరాన్‌పై యుద్ధానికి కారకుల్లో ఒకరైన రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ను తొలగించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. ప్రతినిధుల సభలో పర్యవేక్షణ, న్యాయ కమిటీల్లో సభ్యులుగా ఉన్న డెమొక్రాట్లు రాబర్ట్‌ గార్సియా, జేమీ రస్కిన్‌లకు.. ట్రంప్‌, కుటుంబ సభ్యుల అవినీతిపై విచారణల బాధ్యతలను జెఫరీస్‌ కొన్ని నెలల క్రితమే అప్పగించారు. ఆ పని మొదలుపెట్టిన రాబర్ట్‌ గార్సియా.. ట్రంప్‌ కుటుంబ లావాదేవీలు, నిర్మాణ పనులు, ఖనిజాల ఒప్పందాల్లో పాత్ర, ఎప్‌స్టీన్‌ కేసు దర్యాప్తు తదితర వివరాలు సేకరించారు. తాజాగా గార్సియా రిపబ్లికన్లను, ట్రంప్‌ సన్నిహితులను ఉద్దేశిస్తూ.. ‘‘న్యాయవాదులను సిద్ధం చేసుకోండి’’ అని ఎక్స్‌లో సందేశం పెట్టారు. సెనేట్‌లో డెమోక్రాట్ల నేత చుక్‌ షూమర్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌ ఇన్‌సైడర్‌ సమాచారంతో స్టాక్‌మార్కెట్లో లావాదేవీలు చేస్తున్నారని ఆరోపించా రు. ట్రంప్‌ రియల్‌ఎస్టేట్‌ ప్రాజెక్టులు, ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కా్‌ఫతో కలిసి నిర్వహిస్తున్న క్రిప్టో కరెన్సీ వ్యాపారాలపై విచారణ చేపడతామని సెనేట్‌లో డెమోక్రాట్ల నేత రిచర్డ్‌ బ్లూమెంటల్‌ చెప్పారు.


అభిశంసనకు ప్రయత్నిస్తే నాశనమే: ట్రంప్‌

డెమొక్రాట్లు తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తే ఆ పార్టీ నాశనం అవుతుందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు. అమెరికాలో మధ్యంతర ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్‌ వైట్‌హౌజ్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘‘నాపై ఏ కారణంతో అభిశంసన పెడతారు? దేశాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నందుకా? చరిత్రలో ఎన్నడూ లేనంత విజయవంతంగా దేశం ముందుకు వెళుతోంది. అయినా అభిశంసనపై నాకేం ఆందోళన లేదు. డెమొక్రాట్లు అలా చేస్తే.. వారి పార్టీ నాశనం అవుతుంది’’ అని ట్రంప్‌ హెచ్చరించారు. డెమొక్రాట్లు సహకరిస్తే కలిసి పనిచేసేందుకు సిద్ధమని.. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవాలని చూస్తే వీటో అధికారాన్ని వినియోగిస్తానని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి...

భారతీయ అమెరికన్లను దూరం చేసుకున్న రిపబ్లికన్లు

యూరప్‌లో విమానాలకు బాంబు బెదిరింపులు.. దారి మళ్లించిన అధికారులు..

Updated Date - Nov 06 , 2026 | 04:56 AM