Share News

యూరప్‌లో విమానాలకు బాంబు బెదిరింపులు.. దారి మళ్లించిన అధికారులు..

ABN , Publish Date - Nov 05 , 2026 | 07:33 PM

యూరప్‌లో వరుస బాంబు బెదిరింపులు విమానయాన సంస్థలు, ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. పలు విమానాలకు గురువారం బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కొన్ని విమానాలను దారి మళ్లించగా.. మరికొన్నింటిని అత్యవసరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేశారు.

యూరప్‌లో విమానాలకు బాంబు బెదిరింపులు.. దారి మళ్లించిన అధికారులు..
European flights

ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 5: యూరప్‌లో వరుస బాంబు బెదిరింపులు విమానయాన సంస్థలు, ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. పలు విమానాలకు ఇవాళ (గురువారం) బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే కొన్నింటిని దారి మళ్లించగా.. మరికొన్నింటిని అత్యవసరంగా ల్యాండ్ చేసి తనిఖీలు చేశారు. బెదిరింపులు వచ్చిన ఎయిర్‌లైన్స్‌లో విజ్ ఎయిర్, ఏరో లింగస్, లాట్ పోలిష్ ఉన్నాయి. అయితే, ఇప్పటివరకు ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు.


డబ్లిన్ నుంచి రోమ్‌కు వెళ్తున్న ఏరో లింగస్‌కు చెందిన ఎయిర్‌బస్ A320 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఫ్రాన్స్‌లోని ఎవ్రూ సైనిక వైమానిక స్థావరానికి దానిని మళ్లించారు. ఈ విమానంలో 151 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం బాంబు నిర్వీర్య బృందాలు విమానాన్ని తనిఖీ చేశాయి. మిలన్ నుంచి వార్సాకు వెళ్తున్న విజ్ ఎయిర్ విమానానికీ బెదిరింపులు వచ్చాయి. దీంతో దానిని వియన్నాకు మళ్లించినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

అలాగే, వార్సా నుంచి పారిస్‌కు వెళ్తున్న లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని రన్‌వేపై ఉండగానే భద్రతా అధికారులు ఆపేశారు. తనిఖీల నిమిత్తం పార్కింగ్ ప్రాంతానికి తరలించి క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, ఎలాంటి ప్రమాదకరమైన వస్తువులు లభించలేదని బల్గేరియన్ అధికారులు తెలిపారు. మరోవైపు, బాంబు బెదిరింపుల కారణంగా మరో మూడు విమానాలను బల్గేరియన్ విమానాశ్రయాల్లోనే అత్యవసరంగా దించాల్సి వచ్చింది. కోపెన్‌హాగన్, మాడ్రిడ్ నుంచి వచ్చిన రెండు విమానాలు సోఫియాలో దిగగా.. లండన్ నుంచి వచ్చిన మరో దానిని ప్లోవ్‌డివ్‌లో ల్యాండ్ చేశారు.


నవంబర్ 3న కూడా యూరప్‌లోని పలు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ర్యానైర్, విజ్ ఎయిర్, ఎల్ఓటీ వంటి విమానయాన సంస్థలకు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పలు విమానాశ్రయాలు, విమానాల్లో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అయితే, ఎలాంటి ప్రమాదకర వస్తువులు కనిపించలేదు. కాగా, తాజా ఘటనల్లో అన్ని విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయని, ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో పేలుడు పదార్థాలు లభించలేదని అధికారులు తెలిపారు. ఈ బెదిరింపుల వెనుక ఎవరున్నారు? ఇవి ఉద్దేశపూర్వకంగా విమానయాన వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మహిళ కిడ్నాప్ డ్రామా.. వెలుగులోకి బంగారం స్మగ్లింగ్ వ్యవహారం..

రాహుల్ మద్యం వ్యాఖ్యలు.. ‘పప్పు’ అంటూ ఆప్ కౌంటర్

Updated Date - Nov 05 , 2026 | 07:37 PM