Share News

భారతీయ అమెరికన్లను దూరం చేసుకున్న రిపబ్లికన్లు

ABN , Publish Date - Nov 05 , 2026 | 08:36 PM

ట్రంప్ సర్కారుపై, రిపబ్లికన్లపై అమెరికాలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొందనే విషయాన్ని మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలు రుజవు చేశాయి. రిపబ్లికన్లకు మద్దతిచ్చే భారతీయ అమెరికన్లు కూడా ఈసారి విముఖత వ్యక్తం చేశారు.

భారతీయ అమెరికన్లను దూరం చేసుకున్న రిపబ్లికన్లు
Indian American voting Pattern in Midterm

ఇంటర్నెట్ డెస్క్: ట్రంప్ సర్కారుపై, రిపబ్లికన్లపై అమెరికాలో అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొందనే విషయాన్ని మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాలు రుజవు చేశాయి. రిపబ్లికన్లకు మద్దతిచ్చే భారతీయ అమెరికన్లు కూడా ఈసారి విముఖత వ్యక్తం చేశారు. ఎన్నికల ముందే పలు సర్వేల్లో ఈ విషయాలు బయటపడ్డాయి. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో భారత సంతతి అమెరికన్ల మనోగతం బయటపడింది. సర్వేలో పాల్గొన్న భారతీయ అమెరికన్లలో ఏకంగా 62 శాతం మంది తాము డెమోక్రాట్లకే ఓటేస్తామని స్పష్టం చేశారు. కేవలం 19 శాతం మాత్రమే రిపబ్లికన్లకు మద్దతు పలికారు. 12 శాతం మంది మాత్రం తాము తటస్థులమని చెప్పారు.


మొత్తం 1000 మంది భారత సంతతి అమెరికన్ వయోజనుల అభిప్రాయాలతో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో పాల్గొన్న భారత సంతతి అమెరికన్ పురుషుల్లో రిపబ్లికన్ల పట్ల వ్యతిరేకత తేటతెల్లమైంది. 40 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 16 శాతం మందే తాము రిపబ్లికన్లకు ఓటేస్తామని చెప్పారు. 2026 మొదట్లో ఈ వర్గంలో రిపబ్లికన్లకు మద్దతు 36 శాతంగా ఉండటం గమనార్హం. కేవలం నెలల వ్యవధిలోనే అధికశాతం మంది ట్రంప్‌ సర్కారుకు దూరమయ్యారు.

యువ భారతీయ అమెరికన్‌లలో కూడా రిపబ్లికన్లపట్ల వ్యతిరేకత కనిపించింది. 2024లో ఈ వర్గంలోని 40 శాతం మంది రిపబ్లికన్‌లకు మద్దతు పలకగా ప్రస్తుతం అది 23 శాతానికి పడిపోయింది. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 46 శాతం మంది తాము డెమోక్రాట్లమని స్పష్టంగా ప్రకటించుకున్నారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా కేవలం 19 శాతం మంది మాత్రమే తాము రిపబ్లికన్లకు మద్దతుదారులమని చెప్పుకున్నారు.


రిపబ్లికన్లపై వ్యతిరేకతతోనే డెమోక్రాట్లకు ఓటేశామని ఏకంగా 35 శాతం మంది ఈ సర్వేలో చెప్పడం కొసమేరుపు. మిగిలిన 65 శాతం మంది మాత్రం డెమోక్రటిక్ పార్టీ విధానాలు నచ్చి అనుకూల ఓటు వేశారు.

వలస విధానాలపై వ్యతిరేకత..

వలసలపై ట్రంప్ అనుసరించిన విధానాలే భారత సంతతి ఓటర్లలో వ్యతిరేకతకు ముఖ్యకారణమని సర్వేలో తేలింది. హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు, డిపోర్టేషన్లు, భారత ఐటీ కంపెనీలపై దర్యాప్తుల వంటివి తీవ్ర ప్రభావం చూపించాయి. అక్రమంగా వలసొచ్చిన వారిని, చట్టప్రకారం దేశంలోకి వచ్చిన వారిని ఒకే గాటన కడుతూ ట్రంప్ పలుమార్లు విమర్శించడం కూడా భారతీయ అమెరికన్లపై ప్రతికూల ప్రభావం చూపించింది.

భారతీయులను టార్గెట్ చేసే జాత్యాహంకార పూరిత పోస్టులను ఎదుర్కొన్నామని సర్వేలో పాల్గొన్న 48 శాతం మంది చెప్పారు. దుర్భాషలనూ కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని మరో 25 శాతం మంది చెప్పారు. అమెరికాలో భారతీయ అమెరికన్ల సంఖ్య 1.5 శాతం. అయితే, ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటేసే భారత సంతతి ఓటర్లు ఫలితాలను కూడా అదే స్థాయిలో ప్రభావితం చేస్తారని అక్కడి వర్గాలు చెబుతున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా రాజకీయాల్లో ఒబామా ‘వారసుడు’

యూరప్‌లో విమానాలకు బాంబు బెదిరింపులు.. దారి మళ్లించిన అధికారులు..

Updated Date - Nov 05 , 2026 | 08:45 PM