Share News

అమెరికా రాజకీయాల్లో ఒబామా ‘వారసుడు’

ABN , Publish Date - Nov 05 , 2026 | 07:20 PM

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఈసారి పలువురు యువ రాజకీయ నాయకులు తమ సత్తా చాటారు. భవిష్యత్తు రాజకీయాల్లో కీలకం కాబోతున్నామని స్పష్టమైన సంకేతాలిచ్చారు.

అమెరికా రాజకీయాల్లో ఒబామా ‘వారసుడు’
Senetor Jon Ossoff

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఈసారి పలువురు యువ రాజకీయ నాయకులు తమ సత్తా చాటారు. భవిష్యత్తు రాజకీయాల్లో కీలకం కాబోతున్నామని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఈ జాబితాలో టాప్‌లో నిలిచిన జాన్ ఒసాఫ్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రాజకీయ వారసుడిగా, తదుపరి ఒబామాగా పరిశీలకులు ఆయనను అభివర్ణిస్తున్నారు.


ఎవరీ జాన్ ఒసాఫ్..

రాజకీయాల్లోకి రాకమునుపు ఒసాఫ్ ఓ డాక్యుమెంటరీ ప్రొడక్షన్ సంస్థను నిర్వహించారు. తన డాక్యుమెంటరీల్లో అవినీతిని ఎండగట్టారు. ప్రముఖ పౌర హక్కుల కార్యకర్త జాన్ ల్యూయిస్‌కు సహాయకుడిగా కూడా పని చేశారు. 2021లో తొలిసారిగా ఆయన జార్జియా రాష్ట్రంలో రిపబ్లికన్లకు షాకిచ్చారు. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ సెనేటర్‌ను ఓడించి విజేతగా నిలిచారు.

తాజా ఎన్నికల్లో ప్రచారం కోసం ఏకంగా 100 మిలియన్ నిధులను సమీకరించారు. 2024లో జార్జియా ఓటర్లు ట్రంప్‌నకు బ్రహ్మరథం పట్టారు. అలాంటి రాష్ట్రంలో ఈసారి జరిగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో మరోసారి రిపబ్లికన్‌ అభ్యర్థి మైక్ కాలిన్స్‌ను ఓడించి సెనేటర్‌గా మరోసారి ఎన్నికయ్యారు. ఒసాఫ్ అట్లాంటాలోఉంటున్నారు. ఆయన భార్య పేరు డా. అలీషా క్రామర్. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.


ఇక సెనేటర్‌గా తొలి పర్యాయంలోనే ఆయన తన సత్తా చాటారు. ప్రైవెటైజ్డ్ హౌసింగ్‌లో మిలిటరీ ఉద్యోగుల కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు, దత్తత వెళ్లిన పిల్లల అవస్థలు, జైళ్లల్లో అవినీతిని ఎండగట్టేందుకు దర్యాప్తులకు నేతృత్వం వహించారు. జాతీయ భద్రతకు సంబంధించి అమెరికా ఉన్నతాధికారుల చాట్‌గ్రూప్‌లో ఓ జర్నలిస్టు చొరబడటంపై కూడా ఆయన దర్యాప్తు చేశారు. విచారణ సందర్భంగా ఏకంగా సీఐఏ డైరెక్టర్‌ను సూటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఈ ఉదంతం దేశానికే తలవంపులు అంటూ ఉన్నతాధికారులను కడిగిపారేశారు.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తప్పులను ఎండగట్టడంలో ముందుండే ఒసాఫ్ తన వాక్పటిమ, అభ్యుదయ వాద భావాల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను గుర్తుకు తెస్తారని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు. అమెరికాలో తదుపరి ఒబామా ఒసాఫ్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

గత నెల సౌదీలో హూతీల దాడిలో గాయపడ్డ తెలంగాణ వాసి మృతి

కోట్ల ఓట్లు.. గంటల్లోనే రిజల్ట్‌!

Updated Date - Nov 05 , 2026 | 07:29 PM