Share News

కోట్ల ఓట్లు.. గంటల్లోనే రిజల్ట్‌!

ABN , Publish Date - Nov 05 , 2026 | 06:15 AM

అమెరికాలో తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ పూర్తిగా బ్యాలెట్‌ పేపర్‌పైనే జరిగింది.

కోట్ల ఓట్లు.. గంటల్లోనే రిజల్ట్‌!
trump

  • అమెరికాలో బ్యాలెట్‌ ఓటింగ్‌ అయినా.. వేగంగా ఫలితాలు

  • కొన్ని గంటల్లోనే లెక్కింపు పూర్తి

న్యూఢిల్లీ, నవంబరు 4: అమెరికాలో తాజాగా జరిగిన మధ్యంతర ఎన్నికల పోలింగ్‌ పూర్తిగా బ్యాలెట్‌ పేపర్‌పైనే జరిగింది. సుమారు 10 కోట్ల మందికిపైగా అమెరికన్లు బ్యాలెట్‌పైనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే.. కొన్ని గంటల వ్యవధిలోనే ఫలితం తేలిపోయింది. మరి ఇదెలా సాధ్యమైంది?. మన దేశంలో అయితే బ్యాలెట్‌ ఎన్నికలంటే ఫలితం వచ్చేందుకు రోజుల తరబడి వేచి చూడాల్సిందే. అగ్రరాజ్యంలో మాత్రం దీనికి భిన్నంగా పోలింగ్‌ పూర్తయిన కొన్ని గంటల వ్యవధిలోనే లెక్కింపును కూడా పూర్తి చేస్తున్నారు. మంగళవారం జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 435 రిప్రజెంటేటివ్స్‌, 35 సెనేట్‌, 36 గవర్నర్‌ సీట్లకు పోలింగ్‌ నిర్వహించారు. పది కోట్ల మందిలో 5.7 కోట్ల మంది అమెరికన్లు పోలింగ్‌కు ఒక రోజు ముందుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా ఎలక్షన్‌ ల్యాబ్‌ పేర్కొంది. పోలింగ్‌ ముగిసిన గంటల వ్యవధిలోనే వేలాది కౌంటింగ్‌ కేంద్రాల నుంచి ఫలితాలు కూడా వెలువడడం ప్రారంభమైంది. మొత్తం 10వేలకు పైగా ప్రాంతాల్లో వేలాది మంది స్థానిక ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. అయితే.. భారత్‌లో మాదిరిగా బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును మాన్యువల్‌గా కాకుండా ఎలక్ట్రానిక్ స్కానింగ్‌ మిషన్ల ద్వారా చేపడతారు. దీంతో ఓట్ల లెక్కింపు వేగంగా పూర్తవుతోంది.


పక్కా లెక్క!

స్కానింగ్‌ మిషన్ల ద్వారా చేపట్టే ఓట్ల లెక్కింపు అత్యంత పారదర్శకంగా.. పక్కాగా ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటరు తమకు ఇచ్చిన బ్యాలెట్‌ పేపర్‌పై నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉండే బాక్స్‌లో టిక్‌ మార్క్‌ చేస్తారు. అనంతరం.. దానిని స్కానర్‌ మిషన్‌లోకి పంపగా సదరు అభ్యర్థి ఓట్లలోకి ఈ ఓటు చేరుతుంది. ఈ క్రమంలో ఓటర్లు ఎక్కువగా ఉన్న స్థానాల్లో హైస్పీడ్‌ స్కానర్లను వినియోగిస్తామని అధికారులు పేర్కొన్నారు. గంటకు వేలాది బ్యాలెట్‌లను ఈ స్కానర్లు లెక్కిస్తాయన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా పరిమితంగా కాకుండా భారీ సంఖ్యలో కేంద్రాలను ఏర్పాటు చేసి చేపడతారు. తాజా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును 10 వేలకుపైగా ప్రాంతాల్లో చేపట్టారు.

ఈ వార్తలు కూడా చదవండి..

డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే.

అమెరికా తొలి ముస్లిం సెనెటర్ భార్యకు భారతీయ మూలాలు

Updated Date - Nov 05 , 2026 | 06:16 AM