Share News

దలైలామా వారసత్వంపై భారత్‌తో సంప్రదింపులకు అమెరికా సిఫారసు

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:13 PM

దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియలో చైనా జోక్యాన్ని అడ్డుకునేందుకు భారత్‌తో ఉన్నతస్థాయి సంప్రదింపులు జరపాలని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ద్వైపాక్షిక కమిషన్ సిఫార్సు చేసింది. 14వ దలైలామా వారసుడి ఎంపికకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది.

దలైలామా వారసత్వంపై  భారత్‌తో సంప్రదింపులకు అమెరికా సిఫారసు

ఇంటర్నెట్ డెస్క్: దలైలామా వారసుడి ఎంపిక ప్రక్రియలో చైనా జోక్యాన్ని అడ్డుకునేందుకు భారత్‌తో ఉన్నతస్థాయి సంప్రదింపులు జరపాలని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ద్వైపాక్షిక కమిషన్ సిఫార్సు చేసింది. 14వ దలైలామా వారసుడి ఎంపికకు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. దలైలామా వారసుడిని గుర్తించి, అధికారికంగా ప్రకటించే ఏకైక చట్టబద్ధమైన అధికారం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కే ఉండాలని నివేదిక స్పష్టం చేసింది. వారసత్వ ప్రక్రియను అంతర్జాతీయ స్థాయిలో ఆధిపత్య పోరుగా మార్చేందుకు చైనా ప్రయత్నించే అవకాశముందని అమెరికా-చైనా ఆర్థిక, భద్రతా సమీక్ష కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో తనకు అనుకూలమైన ఫలితం వచ్చేలా ఒత్తిడి తేవడం, ఇతర బలవంతపు చర్యలకు దిగడం వంటివి చైనా చేయవచ్చని హెచ్చరించింది.


చైనా ఎంపిక చేసిన లేదా నియమించిన దలైలామా వారసుడిని అమెరికా గుర్తించకూడదనే విధానాన్ని కాంగ్రెస్ ఆమోదించాలని నివేదిక సూచించింది. ఈ విధానాన్ని అమలు చేయడంతోపాటు వారసత్వ ప్రక్రియకు సంబంధించి అమెరికా ప్రభుత్వం ముందస్తుగా సన్నద్ధం కావాలని పేర్కొంది. ఇందులో భాగంగా భారత ప్రభుత్వంతో విదేశాంగ శాఖ కార్యదర్శి ఉన్నతస్థాయి సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. చైనా ప్రభావాన్ని విస్తరించేందుకు చేపట్టే ప్రయత్నాలపై నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం సహా వారసత్వ ప్రక్రియకు సంబంధించిన అత్యవసర పరిస్థితులపై భారత్‌తో సమన్వయం చేసుకోవాలని నివేదిక పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

జపాన్‌లో బద్దలైన అగ్నిపర్వతం.. షాకింగ్ వీడియో వైరల్

వాంతి చేసుకునే ప్రయత్నంలో ఫోర్క్ మింగిన మహిళ.. చివరకు..

Updated Date - Nov 23 , 2026 | 12:13 PM