చైనా నుంచి బంగ్లాదేశ్‌కు మిసైల్ మెటీరియల్‌తో నౌక.. స్వాధీనం చేసుకున్న ఇండోనేషియా
ABN , Publish Date - Nov 23 , 2026 | 01:39 PM
చైనా నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తున్న ఓ కార్గో నౌకను ఇండోనేషియా నౌకాదళ అధికారులు అడ్డుకున్నారు. ఆ నౌకలో ఉన్న రసాయనాలు, లక్షల సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నౌకలో 405 టన్నుల సోడియం పర్క్లోరేట్ ఉన్నట్లు గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్తున్న ఓ కార్గో నౌకను ఇండోనేషియా నౌకాదళ అధికారులు అడ్డుకున్నారు. ఆ నౌకలో ఉన్న రసాయనాలు, లక్షల సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నౌకలో 405 టన్నుల సోడియం పర్క్లోరేట్ ఉన్నట్లు గుర్తించారు. రాకెట్లు, క్షిపణుల ఇంధన తయారీలో ఉపయోగించే శక్తిమంతమైన ఆక్సీకరణ రసాయనమే సోడియం పర్క్లోరేట్. స్వాధీనం చేసుకున్న ఆ రసాయన పరిమాణంతో సుమారు 100 క్షిపణుల వరకు తయారు చేయవచ్చని ఇండోనేషియా నౌకాదళ అధికారులు వెల్లడించారు. ఆ రసాయన నిల్వలను ఎవరికి పంపిస్తున్నారు అన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఢాకాకు చెందిన ది బిజినెస్ స్టాండర్డ్ (టీబీఎస్) పత్రిక ఈనెల 23న ఈ మేరకు కథనం ప్రచురించింది.
టీబీఎస్ కథనం ప్రకారం.. కొమొరోస్ దేశ జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ స్టార్లైన్స్ నౌక.. చైనాలోని లియాన్యుంగాంగ్ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా పోర్టుకు బయలుదేరింది. ఈనెల 7న ఉత్తర సుమత్రాలోని బెలావాన్ సమీపంలో ఇండోనేషియా జలాల్లోకి వచ్చినపుడు నౌకాదళ అధికారులు ఆ నౌకను అడ్డుకున్నారు. వాస్తవానికి ఈ నౌక ఈనెల 8న మోంగ్లా పోర్టుకు చేరుకోవాల్సి ఉంది. నౌక అనుమానాస్పదంగా కదలడం, ముందుగా నిర్ణయించిన మార్గాన్ని పక్కనపెట్టి బెలావాన్ జలాల్లో అనూహ్యంగా ఆగడంతో నౌకాదళ అధికారులు నౌకను సీజ్ చేసి తనిఖీ చేశారు.
రసాయనాల తరలింపుపై దర్యాప్తు
నౌకలోని మొత్తం 36 కంటైనర్లను తనిఖీ చేయగా.. వాటిలో 15 కంటైనర్లలో 405 టన్నుల సోడియం పర్క్లోరేట్ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా 54 ప్యాలెట్లలో లక్షల సంఖ్యలో 4జీ ఎల్టీఈ సిమ్ కార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారని ది బిజినెస్ స్టాండర్డ్ (టీబీఎస్) పత్రిక వెల్లడించింది. ఈ వ్యవహారంపై ఇండోనేషియా నౌకాదళం దర్యాప్తు చేపట్టింది. నౌకలోని సిబ్బందిని విచారించడంతో పాటు సరుకు రవాణాకు సంబంధించిన పత్రాలు, రసాయనాల తరలింపు వెనుక ఉన్న కారణాలను పరిశీలిస్తోంది. ఈనెల 20న బెలావాన్లోని నౌకాదళ ప్రాంతీయ కమాండ్-1 ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నౌక స్వాధీన వివరాలను వెల్లడించింది. ఈ సరుకును రవాణా చేస్తున్న షిప్పింగ్ కంపెనీ, సరుకు యజమానులు, బంగ్లాదేశ్‌లోని అసలు సరుకు స్వీకర్తల వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. బంగ్లాదేశ్‌కు చెందిన దిగుమతిదారుడి గుర్తింపు కూడా తెలియరాలేదని టీబీఎస్ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
జపాన్‌లో బద్దలైన అగ్నిపర్వతం.. షాకింగ్ వీడియో వైరల్
వాంతి చేసుకునే ప్రయత్నంలో ఫోర్క్ మింగిన మహిళ.. చివరకు..