Baloch leader writes to Jaishankar: భారత్ భద్రతకు ముప్పు.. జైశంకర్‌కు బలోచ్ నేత సంచలన లేఖ
ABN , Publish Date - Jan 02 , 2026 | 08:18 PM
పాకిస్థాన్ నుంచి 2025 మేలో తాము స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నామని బలోచ్ నేత తమ లేఖలో గుర్తుచేశారు. 2026 మొదటి వారంలో '2026 బలోచిస్థాన్ గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్'ను బలూచిస్థాన్ రిపబ్లిక్ జరుపుకోనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.
ఇస్లామాబాద్: బీజింగ్-ఇస్లామాబాద్ మధ్య పెరుగుతున్న సంబంధాలపై బలోచిస్థాన్ ముఖ్య నేత, మానవ హక్కుల కార్యకర్త మీర్ యార్ బలోచ్ (Mir Yar Baloch) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే నెలల్లో పాకిస్థాన్ ఆక్రమిత బలోచిస్థాన్ ప్రాంతంలో చైనా తమ సైనిక బలగాలను మోహరించే అవకాశం ఉందంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar)కు జనవరి 1న బహిరంగ లేఖ రాశారు. చైనా బలగాల మోహరింపు ఇటు బలోచిస్థాన్ ప్రాంతంతో పాటు భారత్‌కు కూడా తీవ్ర ముప్పుగా పరిణమించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పాకిస్థాన్ దురాక్రమణలో దశాబ్దాలుగా బలోచిస్థాన్ అణచివేతకు గురైందని, తీవ్ర మానవ హక్కులు ఉల్లంఘన జరిగిందని అన్నారు.
పాకిస్థాన్ నుంచి 2025 మేలో తాము స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నామని బలోచ్ నేత తమ లేఖలో గుర్తుచేశారు. 2026 మొదటి వారంలో '2026 బలోచిస్థాన్ గ్లోబల్ డిప్లొమాటిక్ వీక్'ను బలూచిస్థాన్ రిపబ్లిక్ జరుపుకోనున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. తద్వారా ప్రపంచ దేశాలతో నేరుగా దౌత్యసంబంధాలు నెలకొల్పుకునేందుకు, పాక్ సైన్యం సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనను ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు.
బలూచ్ రిపబ్లిక్‌లోని 60 మిలియన్ల ప్రజల అభీష్టానికి భిన్నంగా చైనా సైన్యం అక్కడ తిష్టవేస్తే భారత్-బలూచిస్థాన్‌లకు ఊహించని రీతిలో సవాళ్లు ఎదురుకావచ్చని మీర్ యార్ బలోచ్ హెచ్చరించారు. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌పై తీవ్ర ఆందోళనను ఆయన వ్యక్తం చేస్తూ, సీపీఈసీ ప్రాజెక్టు ప్రస్తుతం చివరి దశగా చేరిందని, ఇందువల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్నారు. ఈ ముప్పును సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు భారత్, బలోచిస్థాన్ మధ్య స్పష్టమైన, పరస్పర సహకారం అనివార్యమని సూచించారు. మోదీ ప్రభుత్వం 'ఆపరేషన్ సిందూర్'తో తీసుకున్న చర్యలను సైతం మీర్ ప్రశంసించారు. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని మోదీ ప్రభుత్వం ప్రదర్శించిన ధైర్యం శ్లాఘనీయమని, ప్రాంతీయ భద్రత పట్ల భారత్‌కు ఉన్న నిబద్ధతను ఆపరేషన్ సిందూర్ చాటిచెప్పిందని ప్రశంసించారు.
ఇవి కూడా చదవండి..
మళ్లీ బయట ప్రపంచంలోకి కిమ్ కుమార్తె
న్యూ ఇయర్ రోజు విషాదం.. హోటల్‌లో శవమై తేలిన నటుడి కూతురు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి