Tommy Lee Joness: న్యూ ఇయర్ రోజు విషాదం.. హోటల్‌లో శవమై తేలిన నటుడి కూతురు
ABN , Publish Date - Jan 02 , 2026 | 04:18 PM
ప్రముఖ హాలీవుడ్ నటుడు టామీ లీ జోన్స్ కూతురు విక్టోరియా జోన్స్ చనిపోయింది. 34 ఏళ్ల వయసులో హోటల్ గదిలో శవమై తేలింది. విక్టోరియా మరణానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
న్యూ ఇయర్ రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు టామీ లీ జోన్స్ కూతురు విక్టోరియా జోన్స్ చనిపోయింది. 34 ఏళ్ల వయసులో హోటల్ గదిలో శవమై తేలింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. విక్టోరియా లీ శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని ఫెయిర్‌మౌంట్ హెటల్‌లోని గదిలో జనవరి 1వ తేదీ తెల్లవారుజామున చలనం లేకుండా పడిపోయి కనిపించింది. హోటల్ సిబ్బంది మెడికల్ ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న మెడికల్ టీం ఆమెను పరీక్షించింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించింది.
ఇక, సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన హోటల్ దగ్గరకు చేరుకున్నారు. మృతురాలిని విక్టోరియా జోన్స్‌గా గుర్తించారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విక్టోరియా మరణానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదు. కాగా, విక్టోరియా జోన్స్ తండ్రి బాటలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాల నటిగా పలు సినిమాల్లో నటించింది. తండ్రితో కలిసి మెన్ ఇన్ బ్లాక్ 2లో నటించింది. తండ్రి దర్శకత్వం వహించిన ‘ది త్రీ బరియల్స్ ఆఫ్ మెల్‌క్విడ్స్ ఎస్ట్రాడా’లో నటించింది.
‘వన్ త్రీ హిల్’ వెబ్ సిరీస్‌లో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చింది. ఇక, విక్టోరియా తండ్రి టామీ లీ జోన్స్ హాలీవుడ్‌లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. ఆయన నటనకు ఆస్కార్ అవార్డు సైతం వచ్చింది. కేవలం నటుడిగానే కాదు.. దర్శకుడిగా కూడా ఆయన సత్తా చాటారు. ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అవెంజర్స్ సిరీస్‌లో కూడా ఆయన నటించారు.
ఇవి కూడా చదవండి
అన్వేష్ కొత్త డ్రామా.. హిందూ దేవుళ్లు కలలో కనిపించారంటూ..
ఇలాంటి నీళ్లు తాగితే ప్రాణాలకు ముప్పు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి