Share News

చలికాలంలో గుండెపోటు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABN , Publish Date - Nov 20 , 2026 | 06:41 AM

చలికాలం వచ్చిందంటే జలుబు, దగ్గు వంటి సమస్యలే గుర్తుకొస్తాయి. కానీ చలి ప్రభావం గుండె ఆరోగ్యంపైనా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో గుండెపోటు ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ఇంటర్నెట్ డెస్క్: చలికాలం వచ్చిందంటే జలుబు, దగ్గు వంటి సమస్యలే గుర్తుకొస్తాయి. కానీ చలి ప్రభావం గుండె ఆరోగ్యంపైనా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల రక్తపోటు పెరిగి గుండెపై అదనపు భారం పడుతుంది. ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఈ కాలంలో మరింత జాగ్రత్త అవసరం. అసలు చలికాలంలో గుండెపోటు ముప్పు ఎందుకు పెరుగుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం రండి.


చలితో గుండెపై ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది?

వాతావరణం చల్లబడినప్పుడు శరీరం తన వేడిని కాపాడుకునేందుకు చర్మానికి దగ్గరగా ఉండే రక్తనాళాలను కుంచించుకుపోయేలా చేస్తుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. రక్తాన్ని శరీరమంతా పంపించేందుకు గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. అంతేకాకుండా చలి కారణంగా శరీరంలో ఒత్తిడికి సంబంధించిన ప్రతిస్పందనలు కూడా చురుకవుతాయి. దీంతో గుండె వేగం, రక్తపోటు పెరగవచ్చు. ఇప్పటికే గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయినవారికి ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారవచ్చు.

ఉదయం చలి, ఆహారపు అలవాట్లతోనూ ముప్పు

చలికాలంలో ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. అలాంటి సమయంలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఒక్కసారిగా చల్లని వాతావరణంలోకి వెళ్లడం, తీవ్రమైన వ్యాయామం చేయడం లాంటివి గుండెపై ఒత్తిడిని పెంచుతాయి. వృద్ధులు, గుండె సమస్యలున్నవారు తీవ్రమైన చలి, దట్టమైన పొగమంచు ఉన్నప్పుడు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది.


చలికాలంలో గుండెను ఎలా కాపాడుకోవాలి?

వెచ్చగా ఉండే దుస్తులు ధరించాలి: బయటకు వెళ్లేటప్పుడు వాతావరణానికి అనుగుణంగా దుస్తులు వేసుకోవాలి. ముఖ్యంగా తల, చెవులు, ఛాతీ భాగాలను చలి నుంచి కాపాడుకోవాలి.

వ్యాయామంలో జాగ్రత్తలు పాటించాలి: ఉదయం మరీ చల్లగా ఉన్నప్పుడు వాకింగ్ సమయాన్ని మార్చుకోవచ్చు. అవసరమైతే ఇంట్లోనే తేలికపాటి వ్యాయామం చేయాలి. వ్యాయామం ప్రారంభించే ముందు నెమ్మదిగా నడుస్తూ శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. ఒక్కసారిగా తీవ్రమైన శారీరక శ్రమ చేయకూడదు.

ఆహారంపై శ్రద్ధ పెట్టాలి: ఆకుకూరలు, కాలానుగుణ పండ్లు, పప్పులు, సంపూర్ణ ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు, నూనెలో వేయించిన ఆహారం, స్వీట్లను తగ్గించాలి.


ఇవీ చదవండి

సంప్రదాయం వెనుక సైన్స్.. అరటి ఆకులో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

రోజూ క్యారెట్ తింటే 5 ప్రయోజనాలు.. కంటిచూపు నుంచి చర్మ ఆరోగ్యం వరకు!

Updated Date - Nov 20 , 2026 | 06:41 AM