సంప్రదాయం వెనుక సైన్స్.. అరటి ఆకులో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!
ABN , Publish Date - Nov 19 , 2026 | 01:43 PM
భారతీయ సంప్రదాయంలో అరటి ఆకుపై భోజనం చేయడానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సంప్రదాయం వెనుక కేవలం ఆచారం మాత్రమే కాకుండా కొన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్, నవంబర్ 19: భారతీయ సంప్రదాయంలో అరటి ఆకుపై భోజనం చేయడానికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో అరటి ఆకుల్లోనే భోజనం వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఈ సంప్రదాయం వెనుక కేవలం ఆచారం మాత్రమే కాకుండా కొన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అరటి ఆకుపై భోజనం చేసేటప్పుడు దాని ఉపరితలంపై ఉండే కొన్ని పాలీఫెనాల్ సమ్మేళనాలు ఆహారంలోకి స్వల్పంగా చేరుతాయి. వీటిలో కాటెచిన్స్, గాలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు.
మారుతున్న జీవనశైలి ప్రకారం పీచుపదార్థాలు తక్కువగా తినడం, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను వినియోగించడం, నిద్రలేమి వంటివి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. వీటి కారణంగా శరీరంలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (ROS) పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి అధికంగా పేరుకుపోతే కణాలపై ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. దీని కారణంగా దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, ఫ్యాటీ లివర్, మధుమేహం వంటి సమస్యలు రావచ్చు. అయితే, పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఈ సమస్యలకు చెక్ పెడతాయని వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే వారానికి కనీసం ఒకసారైనా అరటి ఆకుపై భోజనం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని సూచిస్తున్నారు.
ఈ మేరకు ప్రతి కుటుంబం అరటి ఆకుపై భోజనం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసే సమయంలో మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని, ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా అరటి ఆకులను ఉపయోగించాలని సూచిస్తున్నారు. అలాగే, ప్రతి భోజనంలో కనీసం ఒక పండును చేర్చుకోవాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా జామ వంటి స్వదేశీ పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి
రోజూ క్యారెట్ తింటే 5 ప్రయోజనాలు.. కంటిచూపు నుంచి చర్మ ఆరోగ్యం వరకు!
ఎవరికైనా మూర్ఛ వస్తే కంగారు పడొద్దు.. వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి!