రోజూ క్యారెట్ తింటే 5 ప్రయోజనాలు.. కంటిచూపు నుంచి చర్మ ఆరోగ్యం వరకు!
ABN , Publish Date - Nov 19 , 2026 | 07:01 AM
క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కూరగాయలో అనేక పోషకాలు ఇమిడి ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కూరగాయలో అనేక పోషకాలు ఇమిడి ఉన్నాయి. ఇందులోని బీటా-కెరోటిన్, ఫైబర్, పొటాషియం. యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యాన్ని రక్షించడంలో సహాయపడతాయి. అందుకే క్యారెట్‌ను ప్రతిరోజూ తీసుకోవాలని ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే 5 ప్రయోజనాలు పొందవచ్చని వివరిస్తున్నారు.
బరువు నియంత్రణ
క్యారెట్‌లో కేలరీలు తక్కువగా, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. ఈ కూరగాయలోని పీచుపదార్థాల కారణంగా కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. అందుకే క్యారెట్ తిన్న వారు తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఫలితంగా బరువు నియంత్రణ సాధ్యమవుతుంది.
కంటి ఆరోగ్యం
క్యారెట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి విటమిన్ ఏ అందిస్తుంది. కళ్లు ఆరోగ్యవంతంగా ఉండేందుకు విటమిన్ ఏ చాలా అవసరం. ఇది లేకపోతే రేచీకటి ప్రమాదం వచ్చే అవకాశమూ ఉంది. అందుకే కంటి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు క్యారెట్ తినాలంటున్నారు ఆహార నిపుణులు.
చర్మ ఆరోగ్యం
బీటా- కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. విటమిన్ ఏ కూడా చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
మహిళలకు మరీ మంచిది
క్యారెట్లలో ఫాల్కరినాల్ వంటి సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మహిళలకు మేలు చేస్తాయని, వారి ఆరోగ్యాన్ని రక్షిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. పలు హార్మోన్ల సమస్యలను ఈ కూరగాయ దూరం చేస్తుందని వివరిస్తున్నాయి.
రోగనిరోధక వ్యవస్థ
రోగనిరోధక వ్యవస్థ పనితీరును విటమిన్ ఏ మెరుగుపరుస్తుంది. ఈ విటమిన్ పొందేందుకు క్యారెట్ ఉపయోగపడుతుంది. అంటే ఈ కూరగాయ రోగనిరోధక వ్వవస్థకూ మంచి చేస్తుందన్న మాట.
ఎలా తినాలి..?
క్యారెట్లను బాగా కడిగి సలాడ్ రూపంలో తింటే మంచిది. ఇందులో దోసకాయ, టమాటా, బీట్‌రూట్ కలుపుకోవచ్చు. క్యారెట్ జ్యూస్ కూడా తాగవచ్చు. అయితే జ్యూస్ కంటే సలాడ్ లాగా తింటేనే ఎక్కువ ఫైబర్ వస్తుంది. ఒకవేళ జ్యూస్ చేసుకుంటే.. వడగట్టకుండా తాగాలి. అప్పుడే పోషకాలన్నీ అందుతాయి.
ఈ వార్తలూ చదవండి
భూమ్మీదకు రాకుండానే.. కాలుష్యం కాటు!
చలికాలంలో కాళ్ల పగుళ్లు.. సులభమైన ఈ చిట్కాలతో ఉపశమనం!