ఎవరికైనా మూర్ఛ వస్తే కంగారు పడొద్దు.. వెంటనే ఈ జాగ్రత్తలు తీసుకోండి!
ABN , Publish Date - Nov 19 , 2026 | 09:19 AM
మన కళ్లముందే ఎవరైనా అకస్మాత్తుగా కిందపడిపోయి, శరీరం వణుకుతూ, స్పృహ కోల్పోతే చుట్టుపక్కల ఉన్నవారు ఆందోళనకు గురవుతారు.
ఇంటర్నెట్ డెస్క్: మన కళ్లముందే ఎవరైనా అకస్మాత్తుగా కిందపడిపోయి, శరీరం వణుకుతూ, స్పృహ కోల్పోతే చుట్టుపక్కల ఉన్నవారు ఆందోళనకు గురవుతారు. ఏం చేయాలో తెలియక కొందరు పొరపాట్లు కూడా చేస్తుంటారు. ముఖ్యంగా మూర్ఛ (ఎపిలెప్సీ) వచ్చినప్పుడు బాధితుడికి సరైన ప్రథమ చికిత్స అందించడం చాలా ముఖ్యం. ఆ సమయంలో తీసుకునే చిన్న జాగ్రత్తలు కూడా గాయాల ప్రమాదాన్ని తగ్గించగలవు. మరి అలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? తెలుసుకుందామా..
ముందుగా బాధితుడిని సురక్షితంగా ఉంచాలి
ఎవరైనా మూర్ఛతో కిందపడిపోతుంటే వీలైతే జాగ్రత్తగా పట్టుకుని నేలపై పడుకోబెట్టాలి. చుట్టుపక్కల ఉన్న పదునైన వస్తువులు, ఫర్నిచర్‌ను దూరంగా జరపాలి. తద్వారా శరీరం వణుకుతున్న సమయంలో తలకు, చేతులకు, కాళ్లకు గాయాలు కాకుండా చూడవచ్చు.
తల కింద మెత్తని వస్తువు ఉంచాలి
బాధితుడి తల కింద మెత్తని వస్తువు ఉంచాలి. మెడ చుట్టూ బిగుతుగా ఉన్న దుస్తులను వదులు చేయాలి. వీలైతే బాధితుడిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలి. ఇలా చేయడం వల్ల నోటిలోని లాలాజలం బయటకు వెళ్తుంది. అయితే శరీరం బాగా వణుకుతున్నప్పుడు బలవంతంగా కదిలించకూడదు.
మూర్ఛ వచ్చిన సమయాన్ని గమనించాలి
మూర్ఛ ఎప్పుడు ప్రారంభమైందో సమయాన్ని గుర్తుంచుకోవాలి. ఎంతసేపు కొనసాగిందో గమనించాలి. బాధితుడికి స్పృహ తిరిగి వచ్చే వరకు అతడి పక్కనే ఉండాలి. మూర్ఛ తగ్గిన తర్వాత కూడా కొంతసేపు గందరగోళంగా లేదా అలసటగా ఉండవచ్చు. పూర్తిగా తేరుకునే వరకు బాధితుడు ప్రశాంతంగా ఉండేలా సహాయం చేయాలి.
ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు
మూర్ఛ వచ్చినప్పుడు బాధితుడు నాలుకను మింగేస్తాడనే అపోహ చాలామందిలో ఉంది. అందుకే కొందరు నోట్లో వేళ్లు, చెంచాలు, గుడ్డలు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. అలా చేయడం వల్ల బాధితుడికి, సహాయం చేస్తున్న వ్యక్తికి కూడా గాయాలు కావచ్చు.
శరీరం వణుకుతున్నప్పుడు చేతులు, కాళ్లను గట్టిగా పట్టుకుని ఆపే ప్రయత్నం చేయకూడదు.
స్పృహ పూర్తిగా రాకముందు నీళ్లు, ఆహారం లేదా మందులు ఇవ్వకూడదు.
మూర్ఛ సమయంలో బలవంతంగా కదిలించకూడదు.
ఎప్పుడు అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి?
కొన్ని సందర్భాల్లో మూర్ఛ ప్రాణాపాయ పరిస్థితికి దారితీయవచ్చు. ముఖ్యంగా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
మూర్ఛ ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగడం
స్పృహ రాకముందే మళ్లీ మూర్ఛ రావడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడం
మూర్ఛ సమయంలో తీవ్రంగా గాయపడడం
జీవితంలో మొదటిసారి మూర్ఛకు గురికావడం
ఇవీ చదవండి
భూమ్మీదకు రాకుండానే.. కాలుష్యం కాటు!
చలికాలంలో కాళ్ల పగుళ్లు.. సులభమైన ఈ చిట్కాలతో ఉపశమనం!