Share News

భారతీయుల్లో 80% మందికి విటమిన్ D లోపం.. ఈ చిన్న తప్పులే కారణం!

ABN , Publish Date - Jul 18 , 2026 | 08:27 PM

భారతీయుల్లో 80 శాతం మందికి పైగా విటమిన్ D లోపంతో బాధపడుతున్నారని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్‌నీత్ బాత్రా తెలిపారు. కొన్ని సాధారణ ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే విటమిన్ D స్థాయిలను సహజంగానే మెరుగుపరుచుకోవచ్చని ఆమె సూచించారు.

భారతీయుల్లో 80% మందికి విటమిన్ D లోపం.. ఈ చిన్న తప్పులే కారణం!
Vitamin D Deficiency

ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో ఏడాది పొడవునా సూర్యరశ్మి సమృద్ధిగా లభించినప్పటికీ, 80 శాతం మందికి పైగా విటమిన్ D లోపంతో బాధపడుతున్నారని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లవ్‌నీత్ బాత్రా తెలిపారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో వెల్లడించారు. చాలామంది సరైన పరీక్షలు చేయించుకోకుండా స్వయంగా విటమిన్ D సప్లిమెంట్లు వాడటం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని ఆమె పేర్కొన్నారు.

విటమిన్ D శరీరంలో సమర్థవంతంగా పనిచేయాలంటే కేవలం సప్లిమెంట్లు తీసుకోవడం సరిపోదని, దానికి కొన్ని సహజ పోషకాలు (Cofactors) కూడా అవసరమని వివరించారు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల కారణంగా డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే విటమిన్ D స్థాయిలను సహజంగానే మెరుగుపరుచుకోవచ్చని ఆమె సూచించారు. మెగ్నీషియం విటమిన్ Dను శరీరంలో క్రియాశీలంగా మారుస్తుంది. విటమిన్ K2 ఎముకలను రక్షించడంలో సహాయపడుతుంది. జింక్ కణాల రిసెప్టర్లను తెరచి విటమిన్ D పనిచేయడానికి తోడ్పడుతందన్నారు.


ఎండలో ఆరబెట్టిన పుట్టగొడుగులు:

100 గ్రాముల ఎండలో ఆరబెట్టిన పుట్టగొడుగుల్లో విటమిన్ Dతో పాటు జింక్, బీ విటమిన్లు ఉంటాయి. తాజా పుట్టగొడుగులను ఒకటి నుంచి రెండు గంటల పాటు ఎండలో ఆరబెట్టి, దేశీ నెయ్యిలో వండి తింటే శరీరం విటమిన్ Dను బాగా గ్రహిస్తుందని ఆమె తెలిపారు.

మధ్యాహ్నం సూర్యరశ్మి:

ఉదయం కంటే మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల మధ్య వచ్చే సూర్యరశ్మి విటమిన్ D ఉత్పత్తికి అత్యంత ఉపయోగకరమని చెప్పారు. సన్‌స్క్రీన్ రాసుకునే ముందు కనీసం 15 నిమిషాల పాటు చేతులు, కాళ్లపై నేరుగా సూర్యరశ్మి పడేలా ఉండాలని సూచించారు.

గుడ్డు పచ్చసొన:

గుడ్డు పచ్చసొనలో విటమిన్ D ఉంటుంది. అందువల్ల గుడ్డు పచ్చసొనను పారేయకుండా మొత్తం గుడ్డును తీసుకోవాలని, దేశీ నెయ్యిలో కూరగాయలతో కలిపి వండితే మరింత ప్రయోజనం ఉంటుందని చెప్పారు.

మునగాకు పొడి:

మునగాకు పొడిలో మెగ్నీషియం, కాల్షియం, జింక్, విటమిన్ C పుష్కలంగా ఉంటాయి. ఉదయం గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ మునగాకు పొడిని కలిపి తాగడం లేదా రోజూ పప్పు, కూరల్లో కలిపి తీసుకోవాలని సూచించారు.

నువ్వులు:

నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్ అధికంగా ఉంటాయి. చట్నీలు, రోటీలు, లడ్డూలలో నువ్వులు చేర్చుకుని తింటే ప్రయోజనం ఉంటుందని, ముఖ్యంగా చలికాలంలో వీటిని తప్పకుండా తీసుకోవాలని చెప్పారు.

గుమ్మడికాయ గింజలు:

గుమ్మడికాయ గింజల్లో జింక్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. వీటిని నెయ్యిలో స్వల్పంగా వేయించి రాక్ సాల్ట్‌తో కలిపి మధ్యాహ్నానికి ముందు స్నాక్‌గా తీసుకుంటే విటమిన్ D శోషణకు తోడ్పడుతుందని వివరించారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?

ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!

Updated Date - Jul 18 , 2026 | 09:12 PM